తండ్రి, కొడుకులిద్దరిపైనా ఒకేసారి సిబిఐ కేసులు నమోదవ్వబోతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే పేరుతో జరిగిన కుంభకోణంపై  సిబిఐ విచారణ జరిపించాలని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపి ఫైబర్ నెట్ లో కూడా వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో రాష్ట్రప్రభుత్వం సిబిఐ విచారణ కోరినట్లు సమాచారం. రాష్ట్రప్రభుత్వం సిఫారసులను గనుక కేంద్రం ఆమోదిస్తే తండ్రి, కొడుకులు చంద్రబాబునాయుడు, నారా లోకేష్ పై ఒకేసారి సిబిఐ విచారణ మొదలవ్వటం ఖాయమనే అనిపిస్తోంది. ఇదే జరిగితే నిజంగా ఇదొక చరిత్రనే చెప్పాలి. అవినీతి ఆరోపణలపై తండ్రి, కొడుకులను ఏకకాలంలో సిబిఐ విచారణ జరపటం బహుశా ఇదే మొదటి కేసవుతుందేమో.




అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో 4077 ఎకరాలను చంద్రబాబు+మద్దతుదారులు+టిడిపి సీనియర్ నేతలు కాజేపశారంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి వైసిపి ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేయిస్తామంటూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించాడు. అప్పుడు చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే ముందు మంత్రివర్గ ఉపసంఘంతో అంతర్గత విచారణ చేయించాడు. సేకరించిన ఆధారాలతో సిట్ తో పాటు ఈడితో కూడా విచారణ చేయించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇప్పటికే ఈ కుంభకోణంలో సిట్+ఈడి తమ విచారణ ప్రారంభించాయి.  





ఈ దశలోనే తమపై జరుగుతున్న సిట్ విచారణను నిలిపేయాలంటూ టిడిపి సీనియర్ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్యలు కోర్టులో కేసులు వేశారు. వైసిపి ఆరోపణలు చేసినపుడేమో ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమంటూ తండ్రి, కొడుకులతో పాటు యావత్ టిడిపి నేతలు ప్రభుత్వాన్ని సవాలు చేశారు. తమపై ఆరోపణలు చేసిన ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకునేందుకు ఎందుకు భయపడుతోందంటూ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారు. తీరా సిట్ తో విచారణ చేయించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యేటప్పటికి మరి టిడిపి నేతలు కోర్టులో కేసులు ఎందుకు వేశారో అర్ధం కావటం లేదు. తమలో ఎటువంటి తప్పులు లేనపుడు, తాము అవినీతికి పాల్పడనపుడు సిట్ విచారణకు సహకరించి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటం వాళ్ళకే మంచిది కదా?




సిట్ విచారణ జరిపే విషయంలో హైకోర్టు ఏమంటుందో చూడాలి. ఇదే సమయంలో సిబిఐ విచారణ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఇపుడు ఆసక్తిగా మారింది. ఈ విషయమే ఇంకా తేలలేదంటే తాజాగా ఫైబర్ నెట్ లో జరిగిన కుంభకోణం విచారణను కూడా సిబిఐకే ఇవ్వటమే గమనార్హం. తండ్రి, కొడుకుల మీద అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ చేయటం అనే అంశం ఇపుడు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది. జగన్ సిఫారసుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి గనుక సానుకూలంగా స్పందిస్తే ఏపి రాజకీయాల్లో సంచలనం మొదలైనట్లే.  సిబిఐ రంగంలోకి దిగాలి, విచారణ మొదలుపెట్టాలి, ఆరోపణలు నిరూపితం కావాలి అప్పుడు ఏమి జరుగుతుందో చూడాలి.




వైఎస్సార్ మరణించిన తర్వాత జగన్ పైన  కూడా ఇదే విధంగా కేసులు పెట్టి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో జగన్ పై పెట్టిన కేసుల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా నిరూపితం కాలేదు. అప్పట్లో జగన్ పై కేసులన్నీ రాజకీయ ప్రేరేపితాలే అని జనాలు అభప్రాయపడ్డారు. కానీ ఇపుడు చంద్రబాబు, లోకేష్  మీద విచారణ జరిగితే అందుకు సాక్ష్యాలు బయటపడటం ఖాయమని  పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం జరిపిన విచారణలో సమారు రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగినట్లు ప్రాధమిక ఆధారాలు బయటపడ్డాయట. ఈ నేపధ్యంలో జగన్ సిఫారసును కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా ? అనేదే కీలకమైపోయింది. చూద్దాం ఏమి జరుగుతుందో

మరింత సమాచారం తెలుసుకోండి: