కమలంపార్టీకి రాష్ట్రంలో ఉన్న ఇమేజి, పట్టు ఏమిటో అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకన్నా నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్)కు వచ్చిన ఓట్లే ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటి చేయటానికి పార్టీ తరపున గట్టి అభ్యర్ధులే దొరకలేదు. ఇందుకే బిజెపి అభ్యర్ధుల్లో చాలామందికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అప్పటికి ఇప్పటికి బిజెపి ఎదుగుదలలో ఏమాత్రం పురోగతి కనిపించలేదు. అంటే ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నికలు జరిగినా బిజెపికి వచ్చేది లేదు పోయేదిలేదు. ఇటువంటి బీజేపీతో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబునాయుడు తీవ్రంగా పోటి పడుతున్నాడు.
విచిత్రమేమిటంటే బీజేపీ కన్నా టీడీపీ పరిస్దితి భిన్నంగా లేకపోవటమే. కేవలం రెండు పార్టీల మధ్య తేడా ఏమిటంటే టీడీపీకి అసెంబ్లీలో 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలున్నారు. బీజేపీకి రాష్ట్రం నుండి చట్టసభల్లో ఎటువంటి ప్రాతినిధ్యము లేదంతే. నేతల వ్యవహార శైలి, కార్యకర్తల బలగం అన్నింటిలోను రెండు పార్టీల్లోను ఎటువంటి తేడా కనబడటం లేదు. ప్రభుత్వం తరపున జరుగుతున్న లోపాలను, వైసిపి నేతల్లో కొందరు చేస్తున్న ఓవర్ యాక్షన్ పై పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటానికి ప్రతిపక్షాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయినా వేటినీ అడ్వాంటేజ్ గా తీసుకునే పరిస్ధితుల్లో ప్రతిపక్షాలు లేకపోవటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఉదాహరణకు తీసుకుంటే అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం రథం దగ్దం అయిన విషయం చూద్దాం. రథం దగ్దం కాగానే జగన్మోహన్ రెడ్డిపై హిందు వ్యతిరేకిగా ముద్ర వేయటానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ముందు మతపరమైన రాజకీయాలు బిజెపి నేతలు మొదలుపెట్టారు. దీంతో తామెక్కడ వెనకబడిపోతామో అన్న టెన్షన్ తో వెంటనే చంద్రబాబు కూడా నానా యాగీ మొదలుపెట్టేశాడు. ఘటనపై విచారణకు జగన్ ఎప్పుడైతే సీబీఐ విచారణకు ఆదేశించాడో వెంటనే బీజెపీ నేతలు ఆందోళన నుండి వెనక్కు తగ్గారు. దాంతో ఏమి చేయాలో తెలీక చంద్రబాబు ముందు గింజుకున్నాడు. తర్వాత హిందువుల తరపున పోరాటం చేయటమే తమ లక్ష్యంగా కాస్త హడావుడి చేసిన టిడిపి తర్వాత అడ్రస్ లేకుండా పోయింది.
ఒక్క అంతర్వేది విషయంలోనే కాదు ప్రతి విషయంలోను టిడిపి ఇలాగే వ్యవహరిస్తోంది. ఎందుకంటే అలవాటు లేని మత రాజకీయాలు ఒక కారణం అయితే, తమ హయాంలో కూడా ఇపుడు జరిగిన ఘటనల్లాంటివే జరిగుండటం మరో కారణం. ఇపుడు జరుగుతున్న ఘటనలపై మాట్లాడుతున్న టిడిపి నేతలు తమ హయాంలో జరిగిన వాటి గురించి మాట్లాడితే మళ్ళీ నోరిప్పటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ఆందోళనలు జరిపేందుకు బిజెపికి చెప్పుకోదగ్గ బలం లేదు. టీడీపీ కూడా ఎటువంటి ఆందోళనలు చేయటం లేదు. ఎందుకంటే చంద్రబాబు ఎన్నిసార్లు పిలుపిచ్చినా నేతలెవరు పట్టించుకోవటం లేదు. దీంతో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేసే విషయంలో చివరకు చంద్రబాబు బిజెపితో పోటి పడుతున్నారన్న విషయం అర్ధమైపోయింది.