ప్రపంచాన్నంతా కబళించేస్తున్న మాయదారి కరోనా వైరస్ వల్ల మనదేశంలో ఎంతమంది డాక్టర్లు మరణించారో తెలుసా ?  కరోనా వైరస్ సోకిందంటూ రోగులంతా డాక్టర్ల దగ్గరకు పరుగులు పెడతారు. అలాంటిది డాక్టర్లకే వైరస్ సోకితే ఎవరి దగ్గరకు వెళతారు ? తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 515 మంది డాక్టర్లు కరోనా వైరస్ దెబ్బకు బలైపోయారట. కరోనా వైరస్ తో దేశంలో ఎంతమంది డాక్టర్లు మరణించారనే అంశం పార్లమెంటులో చర్చకు వచ్చింది. ఆ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే బదులిస్తు తమ దగ్గర ఎటువంటి డేటా లేదని చెప్పి చేతులు దులిపేసుకున్నాడు.




పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పిన సమాధానం విన్న ఐఎంఏకి ఒళ్ళు మండిపోయింది. నానా అవస్తలు పడుతు కరోనా ఫ్రంట్ వారియర్స్ అంటూ రోగులకు చికిత్సను అందిస్తు మరణించిన డాక్టర్ల వివరాలు కేంద్రం దగ్గర లేదని చెప్పటం తమను అవమానించటమే అంటూ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ మండిపడ్డాడు. కోవిడ్-19 రోగులకు ఎంతమంది డాక్టర్లు, వైద్య సిబ్బంది చికిత్సలు చేయిస్తున్నారనే విషయాన్ని సేకరించేందుకు ఐఎంఏ తరపున 1746 శాఖలు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికి అందిన వివరాల ప్రకారం చనిపోయిన డాక్టర్ల సంఖ్య 515 అని తేలిందన్నారు. ఈ సంఖ్య మారచ్చని కూడా శర్మ చెప్పటం గమనార్హం. ఐఎంఏ డేటాబేస్ ప్రకారం మనదేశంలో డాక్టర్, రోగి నిష్పత్తి 1: 194గా ఉందన్నారు. అంటే అవసరమైన సంఖ్యలో డాక్టర్లు మనదేశంలో లేరన్న విషయం శర్మ ప్రకటనతో అర్ధమైపోతోంది.




రోగులకు చికిత్సను అందిస్తు అదే వైరస్ సోకి మరణించిన 201 మంది డాక్టర్లు 60-70 ఏళ్ళ మధ్య వయస్సున్న వారిగా శర్మ వివరించారు. మరో 171 మంది డాక్టర్లు 50-60 వయస్సులో ఉన్నట్లు చెప్పారు. 70 ఏళ్ళ పై బడిన డాక్టర్లు 66 మంది, 35-50 మధ్య వయసు డాక్టర్లు మరో 59 మందున్నట్లు చెప్పారు. చివరగా 35 ఏళ్ళలోపు డాక్టర్లు 18 మంది కరోనా వైరస్ తో మరణించటం చాలా దురదృష్టమన్నారు. ఇంతకీ చనిపోయిన డాక్టర్ల డేటా కేంద్రం దగ్గర ఎందుకు లేదంటే ప్రజారోగ్యం, ఆసుపత్రులు రాష్ట్రాల జాబితాలోకి వస్తాయి కాబట్టే తమ దగ్గర చనిపోయిన డాక్టర్ల వివరాలు లేవని చెప్పటం పూర్తిగా నిర్లక్ష్యాన్నే చూపుతోంది. ఇదే కరోనా వైరస్ తో చనిపోయిన, ఆసుపత్రుల్లో చేరిన రోగుల వివరాలు కేంద్రం దగ్గరున్నపుడు వాళ్ళకు వైద్యం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది వివరాలు లేవని చెప్పటం పూర్తిగా బాధ్యతారాహిత్యమే.




చనిపోయిన డాక్టర్ల డేటాను ఐఎంఏ విడుదల చేసిన తర్వాత కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ మాట్లాడుతూ తాజాగా విడుదలైన డేటాను తాము పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఐఎంఏ విడుదల చేసిన డేటాను చూసి ఏమని స్పందిస్తారు ? డేటా తప్పని చెబుతారా ? లేకపోతే డేటా ప్రకారం మరణించిన డాక్టర్ల సంఖ్య నిజమే అని ధృవీకరిస్తారా ? అర్ధం కావటం లేదు. కేంద్రం దగ్గర ఎటువంటి డేటా లేనపుడు ఐఎంఏ విడుదల చేసిన డేటానే ప్రామాణికమని అంగీకరించాల్సిందే కదా. కరోనా వైరస్ సోకిన రోగుల ఆధార్ నెంబర్లను ప్రభుత్వం తీసుకుంటున్నపుడు వైద్యం చేస్తు చనిపోయిన డాక్టర్ల ఆధార్ నెంబర్లతో పాటు ఇతరత్రా వివరాలు తీసుకోకపోవటం కేవలం నిర్లక్ష్యం మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: