తాజా సంఘటనతో విశాఖపట్నంలో సబ్బంహరి స్ధాయి ఏమిటో తేలిపోయిందా ? మామూలుగా అయితే తనంతటి వాడు లేడని, లేస్తే మనిషిని కాదు అన్నట్లుగా ఉంటాయి మాజీ ఎంపి సబ్బంహరి మాటలు. ఎల్లోమీడియా ఛానళ్ళల్లో కూర్చుని 24 గంటలు జగన్మోహన్ రెడ్డితో పాటు వైసిపి ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం, విమర్శలు చేయటమే సబ్బం పని. ఒకపుడు వైసిపిలో కీలక పాత్ర పోషించిన సబ్బంను కొన్ని కారణాల వల్ల పార్టీ నుండి బయటకు పంపేశారు. దాంతో అప్పటి నుండి జగన్ అంటేనే మాజీ ఎంపి ఒంటికాలిపై లేస్తున్నారు. ఇందులో భాగంగానే మూడు రాజధానులపైన కూడా జగన్ పైన, విశాఖలో భూదందాలు చేస్తున్నారంటూ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి తదితరులపై సబ్బం ఇప్పటికే చాలా ఓవర్ గా మాట్లాడాడు.
ఇటువంటి నేపధ్యంలోనే శనివారం ఉదయం జీవీఎంసి ఉన్నతాధికారులు సబ్బం హరి ఇంటి కాంపౌండ్ ను కూల్చేశారు. మున్సిపల్ పార్క్ స్ధలాన్ని ఆక్రమించేసుకుని కాంపౌండ్ వాల్ కట్టేసుకున్నారనే ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. ఆరోపణలపై ఈ మధ్య చాలా ఫిర్యాదులే అందుతున్నాయి. ఫిర్యాదులన్నింటినీ విచారించుకున్న ఉన్నతాధికారులు సబ్బంకు నోటీసులిచ్చారు. అయితే ఆ నోటీసులను తీసుకోవటానికి మాజీ ఎంపి నిరాకరించటంతో దాన్ని ఇంటికి అంటించేశారు. శుక్రవారం నోటీసును ఇంటికి అంటించేసిన అధికారులు శనివారం ఉదయమే జేసీబీలను తెప్పించి కూల్చేశారు. దాంతో మండిపోయిన సబ్బం జగన్+విజయసాయిరెడ్డి అండ్ కో పై నోటికొచ్చినట్లు తిట్టదండకం అందుకున్నారు.
సబ్బం పార్కు స్ధలాన్ని ఆక్రమించుకున్నారన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. తనకు నోటీసు ఇవ్వకుండానే కాంపౌండ్ వాల్ ను కూల్చేయటం ఏమిటని సబ్బం అడుగుతున్నాడే కానీ తాను స్ధలాన్ని ఆక్రమించుకోలేదని మాత్రం చెప్పటం లేదు. ఇక్కడే మాజీ ఎంపి కేసు వీకైపోయింది. ఇందుకనే సబ్బంకు మద్దతుగా ఒక్క చంద్రబాబునాయుడు తప్ప ఇంకెవరు మాట్లాడటం లేదు. తనతో పెట్టుకుంటే ప్రభుత్వంలో భూకంపాలు పుట్టిస్తాననేట్లుగా చెప్పుకునే సబ్బంకు స్ధానికంగా ఉండే ఏ నేత కూడా ఎందుకు మద్దతుగా రాలేదు. చంద్రబాబు కూడా అర్ధరాత్రి కాంపౌండ్ వాల్ కూల్చేయటం ఏమిటని అడుగుతున్నాడే కానీ సదరు స్ధలం సబ్బందే అని చెప్పలేకపోతున్నాడు. చంద్రబాబు బాధ ఇలాగుంటే వైజాగ్ లో నే ఉన్న టీడీపీ నేతల్లో చాలామంది సబ్బంకు మద్దతుగా నోరే విప్పలేదు. టీడీపీ నేతలే ఈ విధంగా ఉంటే ఇక మిగిలిన పార్టీల నేతల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.
ఎంతసేపు ఎల్లోమీడియాలో కూర్చుని తాను నిప్పులాంటి వాడినని, తన చరిత్ర ఇంత ఘనమైనదనే సోది తప్ప ఇంకోటి చెప్పుకోవటమే లేదు. జగన్ తిట్టోటోళ్ళు అవసరం కాబట్టి ఎల్లోమీడియా కూడా సబ్బంను బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. తనింటి కాంపౌండ్ వాల్ కూల్చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సబ్బం కోర్టులో కేసు వేస్తారని అందరు అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు విరుద్ధంగా కోర్టులో కేసు వేసే ఆలోచనే తనకు లేదని సబ్బం చెప్పాడు. దీంతోనే మున్సిపల్ పార్కు స్ధలాన్ని తాను ఆక్రమించుకున్నానని సబ్బం అంగీకరించినట్లయ్యింది. మొత్తానికి సంవత్సరాల తర్వాతయినా అయ్యగారి బండారం బయటపడిపోయింది.