జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతల్లోనే టెన్షన్ పెంచేస్తున్నట్లున్నారు. మిత్రపక్షం బీజేపీ  సంగతి దేముడెరుగు సొంత పార్టీ నేతల్లోనే టెన్షన్ నెట్టేస్తుంటే ఎలాగనే చర్చ పార్టీలో పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే  తొందరలోనే గ్రేటర్ హైదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ ఎన్నికల్లో పోటీ చేయటానికి అన్నీ పార్టీలు ఒకవైపు రెడీ అయిపోతున్నాయి. కానీ జనసేన అధినేత మాత్రం ఇంతవరకు ఈ విషయంలో నేతలకు క్లారిటి ఇవ్వలేదు. వేర్వేరు సందర్భాల్లో నేతలతో సమావేశమయినా జీహెచ్ఎంసి ఎన్నికల విషయాన్ని మాత్రం పెద్దగా ప్రస్తావించలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దాంతో పార్టీ లైన్ ఏమిటో ? అధ్యక్షుడి మనసులో ఏముందో అర్ధంకాక పార్టీ నేతల్లో  అయోమయం పెరిగిపోతోంది.




జీహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఓ పద్దతి చేయకూడదంటే ఓ పద్దతి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే మిత్రపక్షమైన బీజేపీ నేతలతో భేటీలు జరగాలి. కార్పొరేషన్ పరిధిలో 150 డివిజన్లున్నాయి. వీటిల్లో ఎవరు ఎన్ని డివిజన్లలో పోటీ చేయాలనే విషయమై చర్చలు జరగాలి. తర్వాత అభ్యర్ధుల ఎంపిక జరగిన తర్వాత వారిని రంగంలోకి దింపాలి. తర్వాత పార్టీ నేతలు, పవన్ కూడా ప్రచారంలోకి దిగాలి. కేవలం తమ పార్టీ అభ్యర్ధుల తరపున మాత్రమే ప్రచారం చేస్తానంటే కుదరదు కదా. మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్ధుల తరపున కూడా ప్రచారంలోకి దిగాలి. అంటే హోలు మొత్తం మీద 150 డివిజన్లలోను పవన్ ప్రచారం చేయాల్సిందే. రెండు పార్టీల తరపున ప్రచారం చేయటానికి ఎంతమంది నేతలున్నా పవన్ ప్రచారంలోకి దిగితే ఆ కిక్కే వేరు కదా. ఒకవేళ జీహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయకూడదని పవన్ అనుకుంటే అదే విషయాన్ని ముందు మిత్రపక్షానికి చెప్పాలి. ఎందుకంటే మొత్తం 150 డివిజన్లకు బీజేపీ అభ్యర్ధులను వెతక్కోవాలి. జనసేన తరపున పోటీ చేయకపోయినా మిత్రపక్షం బీజేపీకి మద్దతుగా అయినా పవన్ ప్రచారంలోకి దిగాల్సిందే.




వాస్తవ పరిస్ధితి ఇలాగుంటే పవన్ మాత్రం ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికలపై నోరెత్తటం లేదట. నిజానికి ఇప్పటి నుండే కసరత్తు చేస్తే కానీ అభ్యర్ధుల ఎంపిక ఓ కొలిక్కిరాదన్న విషయం అందరికీ తెలిసిందే. అసలే బీజేపీ మంచి ఊపుమీదుంది. మొన్న జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ ఎంత గట్టిగా ప్రచారం చేసిందో అందరు చూసిందే. ఉపఎన్నికల్లో గెలుస్తుందో లేదో తెలీదు కానీ అధికార టీఆర్ఎస్ కు మాత్రం ముచ్చెమటలు పోయించింది. తెలంగాణాలో గట్టి ఫోర్సుగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అందుకు మున్సిపల్ ఎన్నికలను సవాలుగా తీసుకుంటుందనటంలో సందేహం లేదు. అందుకనే ఇప్పటి నుండే అభ్యర్ధులు, ప్రచారం అంటు హడావుడి చేస్తోంది. మరింతటి కీలక సమయంలో పవన్ మౌనంగా ఉండటం వల్ల బీజేపీ నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.




2018లో జరిగిన తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో కూడా పోటి చేసే విషయాన్ని పవన్ ఏమీ చెప్పకుండా చివరి నిముషంలో కాడి దింపేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత ముందస్తు ఎన్నికల్లో జనసేన పోటీ చేయదంటూ చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపింది. ఇపుడు కూడా అలాగే చేస్తాడా అనే సందేహం అందరిలో పెరిగిపోతోంది. ఏపి విషయం వరకు పవన్ ఎలా వ్యవహరించినా బీజేపీలో పెద్ద తేడా ఏముండదు. ఎందుకంటే ఏపిలో బీజేపీకి ఉన్నదేమీ లేదు కొత్తగా పోవటానికి. కానీ తెలంగాణాలో అలాకాదు. ఏకంగా నలుగురు ఎంపిలున్నారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోయేదనే ఊపుమీదుంది కమలంపార్టీ. కాబట్టి పవన్ ఎంతకాలం మౌనంగా ఉంటే బీజేపీ+సొంత పార్టీ నేతలకు అంత నష్టం.


 


మరింత సమాచారం తెలుసుకోండి: