అవును ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా అందుకనే నోటికొచ్చినన్ని అబద్దాలు చెప్పేశారు. చంద్రబాబునాయుడు చెప్పిన అబద్ధాలను టీడీపీ నేతలు, ఎల్లోమీడియా యధాశక్తి నోటకి పనిచెప్పి ఒకటికి వందసార్లు చెప్పిందే చెప్పాయి. అయినా జనాలు నమ్మలేదు. ఎందుకంటే యావత్ ఎల్లోబ్యాచ్ చెప్పేదంతా అబద్ధాలే అని తెలుసుగనుకే. జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై ఇంతకాలం చంద్రబాబు+ఎల్లోబ్యాచ్ చెప్పిందంత శుద్ధ అబద్ధమని తేలిపోయింది. ఎలాగంటే అదానీ గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం చేసుకున్నది కాబట్టే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒకటే మాటను చంద్రబాబు అండ్ కో చెబుతున్నదేమిటంటే విశాఖపట్నానికి తాము కష్టపడి అదానీ డేటా సెంటర్ తెస్తే దాన్ని ప్రభుత్వం తరిమేసిందని. తమ హయాంలో అదాని గ్రూపు రూ. 70 వేల కోట్లతో డేటా సెంటర్ పెట్టడానికి బాగా ఇంట్రస్టు చూపినట్లు పదే పదే చెప్పారు. తాము కేటాయించిన భూమిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, పెట్టుబడులను కూడా వెనక్కు నెట్టేసిందని ఒకటే ఊదరగొట్టారు.
సీన్ కట్ చేస్తే చంద్రబాబు అండ్ కో చెప్పిన అదాని డేటా సెంటర్ ఇపుడు విశాఖపట్నంలో ఏర్పాటవ్వబోతోంది. డేటా సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం అదాని గ్రూపుకు 130 ఎకకాలను కేటాయించింది. మొత్తం రూ. 15 వేల కోట్ల పెట్టుబడితే ఏర్పాటు చేయబోయే సెంటర్లో దాదాపు 25 వేలమంది యువతకు ఉద్యోగ, ఉపాధి లభించబోతోంది. మరి టీడీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాన్ని పరిశీలిద్దాం. చంద్రబాబు హయాంలో ఇదే గ్రూపుకు టీడీపీ ప్రభుత్వం 500 ఎకరాలను కేటాయించింది. ఉపాధి 6 వేలమందికి కల్పిస్తామని గ్రూపు హామీ ఇచ్చింది. అంతేకానీ పెట్టుబడులు రూ. 70 వేల కోట్లని ఎక్కడా లేదు. 500 ఎకరాల్లో పెట్టాలని అనుకున్న డేటా సెంటర్లో 6 వేల మందికి మాత్రమే ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నదాన్నే టీడీపీ గోరంతలు కొండతలుగా చేసి చెప్పుకున్నది.
మరి చంద్రబాబు, లోకేష్ అండ్ కో చేస్తున్న ఆరోపణలే నిజమైతే ఇపుడు 130 ఎకరాల్లోనే 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 25 వేలమందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని ఇదే అదాని గ్రూపు ఎలా ఒప్పందం చేసుకుంటుంది ? వైసీపీ ప్రభుత్వం నిజంగానే అదాని గ్రూపును తరిమేస్తే మళ్ళీ వచ్చి ఎలా ఒప్పందం చేసుకుంటుంది ? పైగా టీడీపీ హయాంలో కేటాయించిన భూమికన్నా తక్కువగా, ఉద్యోగ, ఉపాధి నాలుగు రెట్లు ఎక్కువగా, రూ. 15 వేల కోట్ల పెట్టుబడి పెడతామని ఎలా ఒప్పకుంది ? అంటే జరుగుతున్నది చూస్తుంటే చంద్రబాబు, చినబాబు, ఎల్లోమీడియా చెప్పిందంతా అబద్ధాలని తేలిపోతోంది. పదే పదే ఒకేమాటను చెప్పి జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం తప్ప మరోటి కాదనే విషయం స్పష్టంగా రుజువైపోయింది. తమ హయాంలో రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు చెప్పుకోవటం కూడా అబద్ధాలే అని తేలిపోయింది.
ఒక రాష్ట్రానికి ఐదేళ్ళల్లో 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటే మామూలు విషయం కాదు. ఏడాదికి రూ. 3 లక్షల కోట్లుగా లెక్కేసుకోవచ్చు. మరి అన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే అదంతా ఏమైంది ? చంద్రబాబు హయాంలో రాష్ట్రం మొత్తం మీద చెప్పుకోదగ్గ పరిశ్రమ కియా తప్ప రెండోది వచ్చినట్లు కనబడటమే లేదు. ఇంతోటి దానికి పెద్దగా డప్పు కొట్టుకుంటే ఒకటే గోల చేసేవారు అప్పట్లో. ఏ ముఖ్యమంత్రి సదస్సులు పెట్టినా లక్షల కోట్లలో అవగాహనా ఒప్పందాలు చేసుకుంటాయి పరిశ్రమలు. కానీ నిజంగా గ్రౌండ్ అయ్యే పెట్టుబడులు వందల కోట్లలో మాత్రమే ఉంటాయి. చంద్రబాబు హయాంలో కేవలం అవగాహనా ఒప్పందాలను మాత్రమే హైలైట్ చేసుకుని డప్పు కొట్టుకునేసిందన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. మొత్తానికి చంద్రబాబు కేవలం ప్రచారం మనిషనే విషయం తేలిపోయింది. జగన్ మాత్రం చేతల మనిషిగా నిరూపించుకుంటున్నారు.