నిన్నటి దుబ్బాక ఫలితాలతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చేర్పులు చోటుచేసుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తమకు తిరుగులేదు, తమకు ఎదురు లేదు అన్నట్లుగా వ్యవహరించిన టిఆర్ఎస్ పార్టీ ఇక ముందు ముందు జాగ్రత్త పడేందుకు, గత తప్పులను మళ్లీ రిపీట్ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా, జాగ్రత్త పడేందుకు ఇది ఒక చిన్న కుదుపు మాత్రమే. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొకపోతే మళ్ళీ గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. గెలుపు అనేది అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. కాకపోతే అతి ధీమాతో అనవసర ఇబ్బందులు వచ్చిపడతాయి. ఈ విషయం టిఆర్ఎస్ పెద్దలకు తెలియంది కాదు. 



తమకు ఏ పార్టీ పోటీ ఇవ్వలేదని, ఏ పార్టీకి అంత సీన్ లేదు అనే అభిప్రాయంతో ఉండిపోవడం,  వరుసగా రెండోసారి ప్రజలు అధికారం కట్టబెట్టడం, తమ పార్టీ బలంగా ఉండడం, ప్రత్యర్థులు  బలహీనంగా ఉన్నారు అనే లెక్కలు వేసుకోవడం  ఇవన్నీ టిఆర్ఎస్ పెద్దల అభిప్రాయంగా ఉండిపోవడంతో ఈ విధమైన చేదు ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించివేద్దామనే అభిప్రాయంతో, ఆ పార్టీలోని కీలకమైన నాయకులందరినీ టీఆర్ఎస్ లో చేర్చుకుని, ఆ పార్టీని బలహీనం చేయడం, దీంతో రెండో ఆప్షన్ గా బిజెపి అక్కడ బలపడడం చాప కింద నీరులా ఆపార్టీ విస్తరించడం, రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బిజెపి అనే సంకేతాలను ఇవ్వడం, ఇలా ఎన్నో వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. 



ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే,  ఆ పార్టీకి తెలంగాణలో అధికారం దక్కడం అనేది అతి కష్టమైన క్లిష్టమైన ప్రక్రియ గానే కనిపిస్తుంది. మరోసారి తెలంగాణలో ఓటమి చెందడంతో , ఆ పార్టీలోని కీలక నాయకులు ఎవరు ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలామంది బిజెపి వైపు చూస్తూ ఉండడం, ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ . కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను గట్టెక్కించడం అనేది ఎవరి వల్ల కాని పని అన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. దుబ్బాకలో బిజెపి విజయం తో అటు టీఆర్ఎస్,  కాంగ్రెస్ తో పాటు, బీజేపీ కూడా మరింత అప్రమత్తంగా ఉంటూ, రాజకీయం చేయాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఏపార్టీ సత్తా చాటుకుంటుంది అనే దానిని బట్టే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి విజయం అనేది దక్కుతుంది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: