అవును ఫలితాలు వచ్చేసిన తర్వాత జరుగుతున్న విశ్లేషణలు చూసిన తర్వాత చాలామంది ఇదే అనుకుంటున్నారు. తెలంగాణా రాజకీయాల్లో కేసీయార్ ఛాంపియన్ అన్న విషయంలో డౌటు లేదు. కానీ ఆ ఛాంపియన్ కూడా తనకు ఎదురేలేదు అనిపించుకునేందుకు పన్నుతున్న వ్యూహాలు బెడిసికొట్టడంతో దుబ్బాక ఉపఎన్నికలో ఇపుడు తల బొప్పికట్టింది. నిజానికి దుబ్బాక ఉపఎన్నికలో గెలిచేంత సీన్ బీజేపీకి లేదన్న విషయం ఆ పార్టీ నేతలతో సహా అందరికీ తెలిసిందే. అయినా మరి బీజేపీ ఎలా గెలిచింది ? ఇక్కడ బీజేపీ గెలిచిందనే కన్నా కేసీయార్ రాజకీయ వ్యూహాలు బెడిసి కొట్టడం వల్లే కమలం అభ్యర్ధి రఘునందనరావు గెలిచారనటమే సబబుగా ఉంటుంది.
ఇంతకీ కేసీయార్ చేసిన తప్పేమిటి ? ఏమిటంటే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయాలన్నదే కేసీయార్ టార్గెట్ గా పనిచేస్తున్నారు. ఎప్పుడు కూడా ఎన్ని రాజకీయ పార్టీలుంటే అధికారపార్టీకి అంతగా అడ్వాంటేజ్ అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలిసిందే. అందుకనే ఎన్నికల్లో ముగ్గురు, లేకపోతే నలుగురు అభ్యర్ధులు పోటీ చేసిన ఎన్నికల్లో అధికార పార్టీ చాలా సునాయాసంగా గెలుస్తుంటుంది. కానీ ఇక్కడ కేసీయార్ మాత్రం విచిత్రంగా రివర్సులో ఆలోచించటంతోనే దెబ్బ పడిపోయింది. తెలంగాణాలో కాంగ్రెస్ ను తుడిచిపెట్టేయాలన్న ఆలోచన వల్ల బీజేపీని తనంతట తానుగానే తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్నట్లయ్యింది. కాంగ్రెస్ ను నేలమట్టం చేస్తే తనకు ఎదురే ఉండదనుకున్నారు కానీ ఆ స్ధానంలో బీజేపీ పుంజుకుంటోందన్న విషయాన్ని గమనించలేదు.
మొన్ననే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున నలుగురు ఎంపిలు గెలిచిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ గెలుచుకోగలిగిన సీటు సికింద్రాబాద్ మాత్రమే. ఇక్కడ కూడా గెలుస్తు, ఓడుతుంటుంది. కానీ ఏకంగా నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచిందంటే అప్పుడే కేసీయార్ వ్యూహాలు రాంగ్ అవుతున్నాయనే సంకేతాలు కనిపించాయి. కాంగ్రెస్ ఎక్కడైతే బలహీన పడుతోందో అక్కడ జనాలు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ ను కాకుండా బీజేపీని చూస్తున్నారన్న విషయాన్ని కేసీయార్ గ్రహించలేకపోయారు. అదే కేసీయార్ కాంగ్రెస్ జోలికి వెళ్ళకుండా ఉండుంటే ప్రతి నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా త్రిముఖ పోటీ ఉండేదనటంలో సందేహం లేదు.
ఎప్పుడైతే మూడు బలమైన పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరుగుతుందో అప్పుడు కచ్చితంగా టీఆర్ఎస్సే లాభపడేదనటంలో సందేహమే అవసరం లేదు. 2014లోనే కాకుండా 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంఎల్ఏలను, ఎంపిలను కేసీయార్ లాగేసుకున్నారు. దాంతో తాను అనుకున్నట్లు కాంగ్రెస్ బలహీనపడుతోంది. అయితే అదే సమయంలో బీజేపీ పుంజుకుంటోంది. ఎందుకంటే కాంగ్రెస్ నేతల్లో కొందరు కేసీయార్ తో చేతులు కలపటం ఇష్టం లేక వెంటనే బీజేపీలో చేరిపోతున్నారు. ఇక టీడీపీని కూడా కేసీయార్ దెబ్బ తీయటంతో ఆ పార్టీ నేతలు కూడా కొందరు కాంగ్రెస్, మరికొందరు బీజేపీలో చేరిపోతున్నారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత డికే అరుణ లాంటి వాళ్ళు బీజేపిలో చేరారు. ఇలా బీజేపీలో చేరిన నేతల వల్లే కమలం ఆయా నియోజకవర్గాల్లో బలం పుంజుకుని టీఆర్ఎస్ కే ఝులక్ ఇచ్చే స్ధాయికి చేరుకుంది.