దశాబ్దాల పాటు కేవలం హైదరాబాద్ లోని ఓల్డ్ బస్తీకి మాత్రమే పరిమితమైన ఎంఐఎంపార్టీ మెల్లిగా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా పాకుతోంది. ఎంఐఎం అంటే ముస్లిం మైనారిటిల ప్రయోజనాల కోసమే పెట్టిన పార్టీ అన్న విషయం అందరికీ తెలిసిందే. 1927లో పార్టీ ఏర్పడినా దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు కేవలం ఓల్డ్ సిటికి మాత్రమే పరిమితమైంది. హైదరాబాద్ పార్లమెంటు సీటును మాత్రం క్రమం తప్పకుండా గెలుచుకుంటోంది. తర్వాత మెల్లిగా ఓల్డ్ సిటిలోని అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా దృష్టి పెట్టి గెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంటుతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రెగ్యులర్ గా గెలుస్తునే ఉంది. అందుకనే ఎంఐఎం పార్టీని కేవలం ఓల్డ్ సిటికి మాత్రమే పరిమితమైన పార్టీగా చెప్పుకుంటారు జనాలు.




అయితే ఇదంతా చరిత్ర మాత్రమే. ప్రస్తుత పరిస్ధితి ఏమిటంటే మెల్లిగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరిస్తోంది. మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో 2 అసెంబ్లీలు గెలిచింది. అంతకముందు మూడు సీట్లు గెలిచినా మొన్నటి ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లకే పరిమితమైంది. ఇక ఈమధ్యనే జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఐదు నియోజకవర్గాల్లో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఏడాదిలో జరగబోయే పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలపైన కూడా ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ దృష్టిపెట్టారు. బీహార్ ఎన్నికల్లో 25 అసెంబ్లీలకు పోటీ చేస్తే గెలిచింది ఐదుసీట్లలోనే. అయితే బీహార్-పశ్చిమబెంగాల్ రాష్ట్రాల సరిహద్దుల్లోని సీమాంచల్ ప్రాంతంలో పార్టీ మంచి ప్రభావాన్నే చూపగలిగింది. సీమాంచల్ అంటే పశ్చిమబెంగాల్లో ముస్లింల ప్రాబల్యం కలిగిన ప్రాంతమని అందరికీ తెలిసిందే. అందుకనే బెంగాల్లోని సుమారు 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎంఐఎం డిసైడ్ చేసింది.




ఇక తమిళనాడులో కూడా కమలహాసన్ పార్టీ మక్కల్ నెమదు మయ్యంతో పొత్తులు పెట్టుకుని అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వివిధ రాష్ట్రాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో గెలిచిపోవాలన్న టార్గెట్ అయితే ఎంఐఎంకు ఏమీలేదు. ఒకటికి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినా పర్వాలేదు జనాల్లో తమ పార్టీ బాగా పాతుకుపోవాలన్నది అసద్ ఉద్దేశ్యంగా కనబడుతోంది. ఈ ప్లాన్ కారణంగానే రెండు ఎన్నికల్లో ఓడిపోయినా మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీల్లో పాగా వేయగలిగింది. ఇప్పటికి తొమ్మిది రాష్ట్రాల్లో ఎంఐఎంకు  అధ్యక్షులున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీ తరపున రెగ్యులర్ గా కార్యక్రమాలు నిర్వహించుకుంటు వెళుతున్నారు. అంటే గెలుపోటములతో పనిలేకుండా జనాల్లో ఉండటమే వ్యూహంగా ఎంఐఎం అధ్యక్షులు పనిచేస్తున్నారు. మొత్తానికి మెల్లిగా అయినా ఎంఐఎం దేశమంతా పాకుతోందన్నది వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: