తెలంగాణ సీఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థలో పెను మార్పులే తెచ్చారు. తహశీల్దార్ల బాధ్యతల్లో మార్పులు చేశారు. వీఆర్వో వ్యవస్థనే రద్దు చేశారు. అయితే ఇంకా ఈ వీఆర్వో, వీఆర్‌ఏల భవిష్యత్ ఏంటన్నది మాత్రం ఇంకా తేలలేదు. ప్రత్యేకించి వీఆర్వోలను ఎక్కడా సర్దుబాటు చేయలేదు. అయితే వీఆర్వో, వీఆర్‌ఏలను వ్యవసాయశాఖకు బదలాయిస్తారన్న వార్తలు బాగా వస్తున్నాయి. దీనిపై ఇంకా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు.

ఇప్పటికే వీఆర్వో పోస్టులను రద్దు చేసిన ప్రభుత్వం వారిని సర్దుబాటు చేయాల్సి ఉంది. అంతేకాదు.. వీఆర్‌ఏలను వేతన స్కేలు అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి హామీని అమలు చేయాల్సి ఉంది. అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాలని వీఆర్ఓలు కోరుతున్నారు. ఇప్పటికే వీఆర్వో పోస్టులను రద్దు చేసిన ప్రభుత్వం దీని కోసం ఏకంగా చట్టం చేసింది. అయితే వారికి ఉద్యోగ భద్రత ఉంటుందని ప్రకటించింది. అవసరాలను బట్టి ఇతర శాఖల్లోనూ సర్దుబాటు చేస్తామని కేసీఆర్.

వీఆర్వోలు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ నుంచి ఆ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. కార్యాలయాలకు వెళ్తూ ఇతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో 5485 మంది వీఆర్వోలుగా ఉన్నారు. వారందరినీ కూడా రెవెన్యూశాఖలోనే జూనియర్ అసిస్టెంట్లుగా కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అవసరాలకు అనుగుణంగా వీలైనంత వరకు రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తామని, ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తే ఉద్యోగులకు ఆప్షన్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించారు. అన్ని సమస్యలు ఫిబ్రవరి నెలాఖరులోగా పరిష్కరిస్తామన్నారు. దీంతో మళ్లీ వీఆర్వోలు, వీఆర్‌ఏల అంశం చర్చకు వచ్చింది. వీఆర్ఏలు కూడా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 20 వేల వరకు  వీఆర్ఏలు ఉన్నారు. వారందరికీ వేతనస్కేలు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. వీరిలో దాదాపు 3000 మంది వరకు ప్రత్యక్ష నియామకం ద్వారా వచ్చిన వారు మిగతా వారు పదోన్నతి ద్వారా వచ్చిన వారు. డిగ్రీ అర్హత ఉన్న వారు సగం మంది వరకు ఉన్నారు. వీఆర్ఏలకు వేతనస్కేలు అమలు చేయాలన్న డిమాండ్ ఉంది. వీఆర్ఏలకు పదోన్నతి కూడా పెండింగ్ లో ఉంది. మరి కేసీఆర్ వీరి భవిష్యత్తుపై ఏ నిర్ణయం తీసుకుంటారో.. చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: