ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంత కాలానికి నరేంద్రమోడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు నూతన వ్యవసాయ చట్టాల అమలును సుప్రింకోర్టు నిలిపేసింది. సమస్య పరిష్కారినికి నలుగురు వ్యవసాయ రగంలోని నిపుణులతో ఓ కమిటిని నియమించింది. కమిటి ఇటు ప్రభుత్వంతోను అటు రైతు సంఘాల నేతలతోను చర్చిస్తుందని చెప్పింది. రెండుపక్షాలతోను కమిటి సంప్రదింపులు జరిపి సమస్యకు పరిష్కారం సూచించేవరకు వ్యవసాయ చట్టాలపై స్టే విధిస్తున్నట్లు సుప్రింకోర్టు ప్రకటించటం సంచలనంగా మారింది. వ్యవసాయ చట్టాలపై సుప్రింకోర్టు స్టే ఇవ్వటానికి వీల్లేదంటు కేంద్రప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా ధర్మాసనం వినిపించుకోలేదు. వ్యవసాయ చట్టాల అమలు విషయంలో కేంద్రం ఏమి చెప్పినా తాము వినదలచుకోలేదని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పటం కేంద్రానికి మింగుడుపడటం లేదు.



నూతన వ్యవసాయ చట్టాల అమలు విషయంలో నరేంద్రమోడి ఎంతటి పట్టుదలగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఢిల్లీ బార్డర్లో రైతులు గడచిన 49 రోజులుగా ఉద్యమం చేస్తున్న మోడి మనసు మార్చుకోలేదు. కేంద్రం చేసిన కొత్త చట్టం కేవలం కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ప్రయోజనమని రైతుసంఘాలు ఉద్యమం చేస్తున్నాయి. కాబట్టి చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రం తెచ్చిన చట్టం రైతులకే ఉపయోగమంటూ మోడి ఏదో కతలు చెబుతున్నారు. మోడి చెప్పిందే నిజమైతే తమకోసం తెచ్చిన చట్టాలను రైతులే వద్దంటుంటే రద్దు చేయటంలో ఎందుకింత పట్టుదలకు పోతున్నారు ?  ఏదేమైనా ఉద్యమంలో ఇప్పటికి 58 మంది రైతులు చనిపోయారు. రోజు ఎన్నోవేలమంది రైతులు, కుటుంబసభ్యులు ఉద్యమంలో పాల్గొంటున్నారు. దీన్ని చూసిన తర్వాతే సుప్రింకోర్టు ఈ విధంగా స్పందించింది.



సుప్రింకోర్టు నియమించిన కమిటి సభ్యులు హర్ సిమ్రత్ మన్, ప్రమోద్ జోషి, అశోక్ గులాటి, భూపేంద్రసింగ్ మన్ కు వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాల్లో కూడా అపారమైన అనుభవం ఉంది. సమస్య పరిష్కారం కోసమే తమకున్న అధికారాల మేరకు కమిటిని నియమించినట్లు కోర్టు స్పష్టంగా చెప్పింది. నిజానికి వ్యవసాయ చట్టాల అమలులో సుప్రింకోర్టు జోక్యం చేసుకోవటం కేంద్రానికి ఏమాత్రం ఇష్టంలేదు. అందుకనే కమిటి వేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే కేంద్రం అభ్యంతరాలను లెక్క చేయకుండా సుప్రింకోర్టు తన పద్దతిలో తాను కమిటిని వేసేసింది. కమిటి ముందుకు కేంద్రం హాజరవ్వదని, అభిప్రాయాలు చెప్పదని ముందుగా సొలిసిటర్ జనరల్ చెప్పారు. అయితే కమిటి ముందు అభిప్రాయాలు  చెప్పటం వల్ల కేంద్రానికి వచ్చే నష్టం ఏమీ లేదని కోర్టు స్పష్టం చేసిన తర్వాత కేంద్రం మెత్తబడింది. కమిటి ముందు గనుక కేంద్రం హాజరుకాకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని కూడా కేంద్రం గ్రహించినట్లుంది. అందుకనే ఇష్టంలేకపోయినా చివరకు కమిటి ఏర్పాటుకు తలూపాల్సొచ్చింది. ఏదేమైనా సుప్రింకోర్టు నరేంద్రమోడకి చాలా గట్టిదెబ్బ కొట్టిందనే అనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: