ప్రధానమంత్రి నరేంద్రమోడికి దిమ్మతిరుగుతున్నట్లే ఉంది. ఈమధ్యనే తయారుచేసిన మూడు వ్యవసాయ చట్టాలను ఎట్టి పరిస్ధితుల్లోను రద్దు చేసేది లేదని గట్టిగా భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో మొన్నటి జనవరి 26వ తేదీ ఢిల్లీలో జరిగిన ర్యాలీ బాగా వివాదాస్పదమైంది. దాంతో రైతుల ఉద్యమం ముగిసినట్లే అని చాలామంది అనుకున్నారు. అయితే వాళ్ళ అంచనాలకు భిన్నంగా ర్యాలీ తర్వాత ఉద్యమం కొత్తరూపు సంతరించుకుని మరింతగా బలపడుతోంది. ఫిబ్రవరి 7వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి ఉద్యమ నేతలు పిలుపివ్వటంతో కేంద్రప్రభుత్వంలో కొత్త టెన్షన్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా ఫెయిల్ చేద్దామని కేంద్రం అనుకునే ఢిల్లీలోకి కొన్ని రోడ్లపైన తాత్కాలిక బ్యారికేడ్లు, ముళ్ళకంచెలు ఏర్పాటు చేసింది.



కేంద్రం చర్యలపై దేశవ్యాప్తంగా మొదలైన నిరసన కారణంగా చివరకు వెనక్కు తగ్గక తప్పలేదు. తాము ఏర్పాటు చేసిన ముళ్ళకంచెలను, రోడ్లపై మేకులను తీసేస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు చెందిన కొందరు ఎంపిలు కూడా కేంద్రం నాటించిన ముళ్ళకంచెలు, బ్యారికేడ్లను చూడాలని అనుకుంటే అడ్డుకున్నారు. మొత్తానికి కారణం ఏదైనా బ్యారికేడ్లు, ముళ్ళకంచెలను తీసేయటమే మోడిపై పెరిగిపోతున్న ఒత్తిడికి నిదర్శనంగా మారింది. అన్నీ వైపుల నుండి అంటే మేధావులు, శాస్త్రవేత్తలు, సెలబ్రిటీలు, ప్రతిపక్షాలు అందరు ఉద్యమానికి మద్దతుగా ట్వీట్లు చేయటం, ప్రధానికి లేఖలు రాయటం, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ తీర్మానాలు పంపటం చేస్తున్నారు.




క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఆమధ్య రైతుల దెబ్బ బీజేపీపై బాగా పడేట్లే కనబడుతోంది. ఎందుకంటే ఉత్తరాధి రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబులోని జాట్ల సామాజికవర్గం నరేంద్రమోడి అంటేనే మండిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా ఏమిటో చూపిస్తామని హెచ్చరించటంతో కమలంపార్టీకి ఇబ్బందులు తప్పేట్లు లేవనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆమధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధి చెప్పినట్లు చివరకు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోక తప్పదేమో అనే అనిపిస్తోంది. మొత్తానికి కొత్తరూపం సంతరించుకున్న  రైతుల ఉద్యమం వల్ల నరేంద్రమోడి దిమ్మతిరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: