అధికారం చేతిలో ఉంది కదాని ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి ఉదాహరణ. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం అవ్వాల్సిన ఇంటింటికి రేషన్ సరుకులు అనే కార్యక్రమం నిమ్మగడ్డ వల్లే గ్రామీణ ప్రాంతాల్లో నిలిచిపోయింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి పై కార్యక్రమం రాష్ట్రమంతా ప్రారంభం కావాల్సుంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 9670 మొబైల్ రేషన్ వాహనాలను కూడా రెడీ చేసుకున్నది. ఈ దశలోనే నిమ్మగడ్డం రంగప్రవేశం చేసి కొన్ని ప్రాంతాల్లో వాహనాలు తిరగటాన్ని నిలిపేశారు. ఇపుడు జరుగుతున్నది పంచాయితి ఎన్నికలు కాబట్టి మొబైల్ వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేందుకు లేదని ఆదేశించారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చినా కుదరదంటే కుదరదని పట్టుబట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలు తిరగాలంటే వాటికున్న రంగులు మార్చాల్సిందే అని మళ్ళీ ఆదేశించారు.
దాంతో చేసేది లేక ప్రభుత్వం కోర్టుకెళ్ళి తన వాదనను వినిపించింది, నిజానికి మొబైల్ వాహనాలను ప్రభుత్వం ఎప్పుడో రెడీ చేసింది. కార్యక్రమం అమలుకు ఫిబ్రవరి 1వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేసుకుంది. అయితే నిమ్మగడ్డ హఠాత్తుగా పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. చివరకు ప్రభుత్వం-ఎలక్షన్ కమీషన్ వాదనలు విన్న కోర్టు ప్రభుత్వ వాదనకే మొగ్గుచూపింది. వాహనాలను ఎప్పుడో రెడీ చేయటం, కార్యక్రమం ప్రారంభ తేదీలను కూడా ప్రకటించేయటం లాంటి వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. అలాగే ఇప్పటికిప్పుడు వాహనాల రంగులను మార్చాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్న వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది.
ఇదే సమయంలో ఎన్నికల కమీషన్ చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొబైల్ వాహనాలు తిరగచ్చని కోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది. దాంతో వాహనాలను తిప్పటానికి ప్రభుత్వం వెంటనే రంగం సిద్ధం చేసేసింది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన వాహనాల తిరగటంపై మార్చి 15వ తేదీ వరకు స్టే ఇచ్చింది. అప్పటికి ఎలాగూ పంచాయితి ఎన్నికలు అయిపోతాయి.