తెలంగాణాలో పార్టీ పెట్టాలని డిసైడ్ అవ్వగానే వైఎస్ షర్మిల వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణాలోని రాజకీయపార్టీలను ముఖ్యంగా టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే తాను కూడా దాని దారిలోనే వెళ్ళాలన్నది షర్మిల నిర్ణయం. అందుకనే మొన్నటి సమావేశంలో హఠాత్తుగా ‘జై తెలంగాణా’ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే తాను కూడా తెలంగాణా నినాదాన్ని ఎత్తుకోవాలన్న విషయం ఆమెకు బాగానే అర్ధమైంది. అందుకను తెలంగాణా సెంటిమెంటు ప్రభావం ఎంతుంది ? వైఎస్సార్ ప్రభావం ఎంతుందనే విషయాన్ని షర్మిల జాగ్రత్తగా భేరీజు వేస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని దివంగత సీఎం వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. పై రెండు జిల్లాల్లో వైఎస్సార్ ప్రభావం ఎలాగుంది, పార్టీ పెడితే జనాల ఆధరణ ఎలాగుంటుందనే విషయాలపై ఫీడ్ బాక్ తీసుకున్నారు.
రాజన్న సంక్షేపాలనను తెలంగాణాలో కూడా తీసుకురావాలన్నది తన కలగా షర్మల చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. అందరు తోడుగా నిలబడితే తన కలను సాకారం చేసుకోవటం సాధ్యమే అన్న తన నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని షర్మిల అందరికీ గుర్తుచేశారు. కాబట్టే వైఎస్ పై అందరిలోను ఇంకా అభిమానం ఉందని ఆమె నమ్మకంగా ఉన్నారు. పనిలో పనిగా కేసీయార్ పనితీరును కూడా షర్మిల ఆరా తీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా ? అభివృద్ధి నిజంగానే జరుగుతోందా ? అనే అంశాలపై డీటైల్డుగా మాట్లాడారు. కేసీయార్ పాలనలో జనాలు ఎంతమేర సంతోషంగా ఉన్నారు ? అనే అంశంపైనే ప్రధానంగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ సందర్భంగానే కేసీయార్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా షర్మిల కూడా జై తెలంగాణ అంటు నినాదాలు చేయటంతో అందరు ఆశ్చర్యపోయారు.
అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ ను ఎదుర్కొనేందుకు షర్మిల కూడా జై తెలంగాణా నినాదాన్నే అస్త్రంగా చేసుకోబోతున్నట్లు అర్ధమవుతోంది. తెలంగాణాలో రాజకీయంగా చాలా వ్యాక్యూమ్ ఉందన్న విషయం షర్మిలకు వచ్చిన ఫీడ్ బ్యాక్ లో స్పష్టగా కనబడిందట. దాంతో ఆ వ్యాక్యూమ్ ను భర్తీ చేయటానికి ఇదే సరైన సమయమని షర్మిల భావించటంతోనే కొత్తపార్టీ ఏర్పాటులో స్పీడు పెంచారని సమాచారం.