తెలుగుదేశంపార్టీతో పొత్తుల విషయంలో మళ్ళీ ఎల్లోమీడియా కొత్త స్ట్రాటజీని ఎత్తుకుంది. టీడీపీ+జనసేన కలిసి పనిచేస్తే అధికార వైసీపీని నిలువరించవచ్చంటు కొత్త పార్ములాను మొదలుపెట్టింది. తన వాదనకు మొన్నటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూపిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్ల ఓటింగ్ వివరాలను లెక్కలతో సహా చెప్పింది. పై రెండు కార్పొరేషన్లలో టీడీపీ+జనసేన గనుక కలిసి పోటీచేసుంటే ఫలితం వేరే విధంగా ఉండేదంటు ఊదరగొట్టడం మొదలుపెట్టింది. ఇక్కడ ఎల్లోమీడియా ఉద్దేశ్యం ఏమిటంటే ఇప్పటికిప్పుడు బీజేపీ, జనసేనలు విడిపోవాలన్నట్లుగానే ఉంది. బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు ఎలాంటి ఉపయోగం ఉండదని కూడా తన లెక్కల ద్వారా తేల్చిచెప్పేసింది. మళ్ళీ టీడీపీతో బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే వైసీపీకి గట్టి పోటీ ఇవ్వవచ్చని కూడా సూచించింది. విశాఖపట్నం కార్పొరేషన్లో వైసీపీ తెచ్చుకున్న ఓట్లకంటే టీడీపీ, జనసేన విడివిడిగా తెచ్చుకున్న ఓట్లు ఎక్కువని సూత్రీకరించటం విశేషం.




అలాగే విజయవాడ కార్పొరేషన్లో కూడా జనసేన వల్లే టీడీపీ 16 డివిజన్లలో ఓడిపోయిందని తేల్చేసింది. ఇదే టీడీపీ+జనసేన కలిసి పోటీచేసుంటే మరిన్ని ఓట్లు తెచ్చుకుని వైసీపీని మించిపోయేవనటంలో సందేహం లేదని చెప్పింది. మొన్నటి పంచాయితి ఎన్నికల్లో టీడీపీ, జనసేన అవగాహనతో పోటీ చేసిన చోట్ల వైసీపీకన్నా మంచి ఫలితాలు రాబట్టినట్లు ఉదాహరణ కూడా చెప్పింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో గుర్తుల కారణంగా రెండు పార్టీల మధ్య అవగాహన సాధ్యం కాలేదని తెగ బాధపడిపోయింది. ఎల్లోమీడియాలో వచ్చిన కథనం చదివిన తర్వాత బీజేపీని వదిలేసి జనసేన తక్షణమే టీడీపీతో చేతులు కలపాలన్నట్లుగానే ఉంది. లేకపోతే బీజేపీతో పొత్తుల్లో పోటీ చేసిన జనసేనకు వచ్చిన ఓట్లు, టీడీపీకి వచ్చిన ఓట్లు ఎక్కువని చెప్పటంలో అర్ధమేంటి ? టీడీపీ+జనసేన కలిసి పోటీచేసుంటే వైసీపీని మించిపోయేవని చెప్పటమేంటి ? బీజేపీకి జనసేనకు మధ్య పొత్తున్నపుడు ఇక టీడీపీతో కలిసి పోటీచేసుంటే అనే ప్రశ్నే ఉత్పన్నం కాదుకదా.




అయినా మొత్తం కథనమంతా అలాగే రాసుకొచ్చిందంటే టీడీపీ+జనసేన పొత్తు పెట్టుకోవాలని సూచించటమే కదా. బహుశా ఆ పొత్తేదో తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలోగానే జరిగితే బాగుంటుందనే ఆశకూడా ఉన్నట్లుంది. ఒకపుడు ఇదే ఎల్లోమీడియా బీజేపీ, టీడీపీ పొత్తు చెడిపోయేదాకా నిద్రపోలేదని తమ్ముళ్ళు ఇప్పటికీ చెబుతుంటారు. అలాగే ఇపుడు టీడీపీ, జనసేనను కలపాలనే ఆలోచన ఉన్నట్లుందని కూడా అనుమానిస్తున్నారు. చూద్దాం పొత్తుల విషయంలో ఏమి జరుగుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: