ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారమే అర్ధంకాకుండా ఉంది. అనవసరంగా ప్రభుత్వంతో వివాదాలు పెట్టుకుంటున్నారు. ఎందుకు అనవసరమైన విషయాలను కెలుక్కుంటున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఈయన తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. చంద్రబాబునాయుడుతో పాటు ఏబీకి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే బాగా మంటగా ఉన్నట్లుంది. అందుకే అసందర్భంగా జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలాగైనా జగన్ను ఇరికించాలన్న ఉద్దేశ్యంతోనే వివేకానందరెడ్డి హత్యకేసును కెలికారు.  ఇప్పటికే అనేక ఆరోపణలను ఎదుర్కొంటు విచారణను కూడా ఫేస్ చేస్తున్న ఏబీ అనవసరంగా ప్రభుత్వంతో గోక్కుంటున్నారు.



 

నాలుగు రోజుల క్రితం సీబీఐకి లేఖరాసిన ఏబి వివేకా హత్యకేసులో తన దగ్గరున్న సాక్ష్యాధారాలను ఇష్తానని చెబుతున్నా ఎందుకని తీసుకోవటం లేదంటూ నిలదీశారు. సీబీఐకి లేఖ రాసిన ఏబీ దాన్ని టీడీపీకి మద్దతుగా నిలిచే మీడియాకు అందించారు. దాంతో అధికారపార్టీ నుండి ఎదురుదాడి మొదలైంది. తాజాగా పోలీసు శాఖ ఉన్నతాధికారులు కూడా ఘాటుగానే స్పందించారు. వివేకా హత్య జరిగింది చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నది ఏబీనే. వివేకా హత్య కేసులో అప్పటి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. వివేకా హత్య తర్వాత మూడు నెలలు టీడీపీనే అధికారంలో ఉంది. హత్య విషయంలో ఏబీ దగ్గర నిజంగానే సాక్ష్యాధారాలుంటే వాటిని అప్పట్లోనే సిట్ కు ఎందుకు ఇవ్వలేదని టెక్నికల్ డీఐజీ పాల్ రాజ్ సూటిగా ప్రశ్నించారు.




 అప్పట్లో ఏర్పాటైన సిట్ కు సాక్ష్యాధారాలు ఇవ్వకుండా ఇపుడు సీబీఐకి ఇస్తానని చెప్పటంలో అర్ధమేంటి ? అంటు నిలదీశారు. వివేకా హత్యకేసులో వైఎస్ కుటుంబసభ్యులను అరెస్టు చేయాలని అప్పటి సిట్ అధిపతి రాహూల్ దేవ్ శర్మపై ఒత్తిడి తెచ్చింది వాస్తవం కాదా అని పాల్ రాజ్ ప్రశ్నకు ఏబీ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.  కమీషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణను బయటపెట్టడం, సీబీఐకి రాసిన లేఖను మీడియాకు విడుదల చేయటం ద్వారా ఏబీవీ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారంటు పాల్ రాజ్ మండిపోయారు. పాల్ మీడియా సమావేశం చూసిన తర్వాత తొందరలోనే ఏబీపై మరో కేసు నమోదైనా ఆశ్చర్యపోవక్కర్లేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిజంగానే ఏబీవీ దగ్గర సాక్ష్యాధారాలుంటే అప్పట్లోనే సిట్ కు ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు అధికారంలో ఉండగా బహిరంగంగా వివేకా హత్య కేసు విషయాన్ని మాట్లాడని ఏబి ఇపుడు పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారన్నదే అర్ధం కావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: