దేశం శ్మశానం అవుతోంది.. వినడానికి కష్టంగా ఉన్నా ఇప్పుడు ఇదే వాస్తవం.. ఇప్పుడు ఇండియాలో రోజూ 3 నుంచి 4 వేల మంది కరోనాతో చనిపోతున్నారు. ఇది కూడా అధికారికంగా చెబుతున్న లెక్కలు మాత్రమే. వాస్తవాలు.. ఇందుకు కొన్ని రెట్లు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కరోనా పరీక్షా కేంద్రాల వద్ద క్యూలు, టీకాల వద్ద క్యూలు,  ఆసుపత్రుల ముందు క్యూలు.. చివరకు శ్మశానాల వద్ద క్యూలు.. దేశం ఓ పెను సంక్షోభంలో కూరుకుపోయింది.

ఇలాంటి పరీక్షా సమయంలో దేశ ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రధాని మోడీ తీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్‌లో ప్రధాని మోడీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. పదిరోజులకోసారి.. నెలరోజులకోసారి మీడియా ముందుకు వచ్చి.. మిత్రోం.. అంటూ తెగ హడావిడి చేశారు. జనతా కర్ఫ్యూ ప్రకటన, తప్పెట్ల మోత.. దీపాలు వెలిగించడం.. ఇలా ఎన్నో నాటకీయ పిలుపులు ఇచ్చారు.

ఆ తర్వాత కరోనా నుంచి దేశాన్ని బయటపడేసేందుకు అంటూ  లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీలు ప్రకటించారు. అవి ఎంత వరకూ ఫలించాయో.. ఆ సొమ్ములు ఎవరి జేబుల్లోకి చేరాయో ఎవరికీ తెలియదు. జనం మాత్రం మరింత పేదరికంలో కూరుకుపోయారు. మరి ఫస్ట్ వేవ్‌లో అంత హడావిడి చేసిన మోడీ.. మరి ఇప్పుడు దేశం ఇంతగా సంక్షోభంలో కూరుకుపోతే.. ఎక్కడా కనపించడే.. నిన్న మొన్నటి వరకూ బెంగాల్ ప్రచారంలో తప్ప..  ప్రజలకు ముఖం చూపించడేం.. అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఓవైపు కోర్టులు ప్రభుత్వం తీరును నిలదీస్తున్నాయి. సుప్రీంకోర్టు కడిగేస్తోంది. వ్యాక్సిన్ విధానంపై కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప చర్యలు ఉండటం లేదు. వ్యాక్సీన్ల ధరల్లో వ్యత్యాసాలపై కోర్టులు నిలదీస్తున్నాయి. ప్రభుత్వం వైఫల్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయినా మిత్రోం.. అంటూ పలకరించే ఆ మోడీ స్వరం మాత్రం ఇప్పుడు వినిపించడం లేదు.. కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: