
ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిల్ వచ్చిన రోజు.. కోర్టులో పరిణామాలను విశ్లేషించిన కె.నాగేశ్వర్.. మీడియాలో మాట్లాడవద్దని రఘురామకు గట్టి ఆదేశాలు ఇచ్చిందని.. ఇది ఒక విధంగా జగన్‌కు గెలుపు అని విశ్లేషించారు. అయితే.. కె. నాగేశ్వర్ సైతం కోర్టు తీర్పును వక్రీకరించారని.. కోర్టు కేవలం ఈ కేసు విషయం వరకే మాట్లాడొద్దని చెప్పిందని.. కానీ నాగేశ్వర్.. అసలు మీడియాతోనే మాట్లాడొద్దని చెప్పిందని ఆర్కే మండిపడుతున్నారు. అయితే అది నిజమే కావచ్చు. కానీ.. అంత మాత్రాన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వంటి మేధావిని జగన్ పక్షపాతి అని చూపే ప్రయత్నం ఆర్కే చేయడమే అసలైన విడ్డూరం.
ఆర్కే నాగేశ్వర్ గురించి ఏం రాశారంటే ... " విచిత్రమేమిటంటే తనను తాను తటస్థవాదిగా చెప్పుకొనే ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వాళ్లు కూడా సుప్రీంకోర్టు విధించిన షరతులకు వక్రభాష్యం చెప్పారు. వాస్తవాలను మరుగుపరచడానికి ప్రయత్నించే వారితో ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు కూడా శ్రుతి కలపడం ఆశ్చర్యంగా ఉంది. రఘుపై నమోదు చేసిన రాజద్రోహం కేసులో ‘ఏబీఎన్ చానల్’తో పాటు మరో చానల్‌ను కూడా సహ కుట్రదారులుగా చేర్చడంపై స్పందిస్తూ, ఆ రెండు చానల్స్ తెలుగుదేశం పార్టీ అనుకూల చానల్స్ అని నాగేశ్వర్ చెప్పుకొచ్చారు.
మేం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధానాలను విమర్శిస్తున్న మాట వాస్తవం. జగన్ రెడ్డి తప్పులను ఎత్తి చూపితే తెలుగుదేశం అనుకూలత అని ప్రొఫెసర్ నాగేశ్వర్ భావిస్తే మేం చేయగలిగింది ఏమీ లేదు. అలా అయితే సీపీఎం సానుభూతిపరుడైన నాగేశ్వర్ తటస్థవాది ఎలా అవుతారు? ఆయన మమ్మల్ని నిందించినట్టుగా మేం ఆయనను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పక్షపాతి అంటే అంగీకరిస్తారా? ఆయన అంగీకరిస్తే మేం కూడా అంగీకరిస్తాం... అంటూ ఆర్కే మండిపడ్డారు.
అయితే.. కె.నాగేశ్వర్ ఎలాంటి వారో.. ఆయన విశ్లేషణ ఎలా సాగుతాయో.. ఇప్పుడు ఆర్కే వచ్చి తెలుగు ప్రజలకు చెప్పాల్సిన దుస్థితి పట్టలేదు. అసలు కె.నాగేశ్వర్ నిష్పాక్షికత గురించి మాట్లాడే నైతిక హక్కు..చంద్రజ్యోతిగా పేరుబడిన ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు లేనేలేదంటున్నారు పాత్రికేయ పెద్దలు.