కానీ.. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో నెగ్గడం అంత సులభం కూడా కాదు. మరి ఇప్పుడు రాజకీయాల్లో గెలవాలంటే ఏం కావాలి. ఓ వ్యూహం కావాలి. ప్రత్యర్థి బలహీనతలేంటి.. మన బలాలేంటి అని పక్కాగా బేరీజు వేయగలగాలి.. మన బలాలను హైలెట్ చేస్తూ.. ప్రత్యర్థి బలహీనతలను హైలెట్ చేస్తూ ప్రచారం చేసుకోగలగాలి. సోషల్ మీడియా వ్యవస్థను పక్కాగా వాడుకోవాలి.
ఏ ఏ అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయో గమనించి.. ఆ స్థాయిలో ప్రచారం చేసుకోగలగాలి. చేసిన మంచిని సోషల్ మీడియాలో గట్టిగా చెప్పుకోవాలి.. ప్రత్యర్థి చెడ్డ పనులపై బాగా చర్చ జరిగేలా క్యాంపెయిన్ చేయాలి.. మరి ఇవన్నీ చేయాలంటే ఓ వ్యూహకర్త కావాలి.. ఓ టీమ్ కావాలి..ప్రశాంత్ కిషోర్ చేస్తున్నది అదే. అందుకే ప్రశాంత్ కిషోర్ తో పని చేయించుకున్న వారంతా అధికారంలోకి వస్తున్నారు. మొన్నటికి మొన్న జగన్.. నిన్నటికి నిన్న తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే కూడా ప్రశాంత్‌తో చేయికలిపి విజయం సాధించాయి.
అయితే ఈ రాజకీయ క్రీడ ప్రశాంత్‌కు కూడా బోర్ కొట్టినట్టుంది. అందుకే తాను ఈ పని మానేస్తున్నానని ఆ మధ్య ప్రకటించాడు. కానీ.. ఆ తర్వాత తాజాగా ఓ ప్రకటన చేశాడు. 2024కు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే.. ఆయన కోసం పని చేసేందుకు సిద్ధం అంటూ ఓ ఆఫర్ ఇచ్చాడు. అంటే ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని భావిస్తున్నారన్నమాట. ఇప్పటికే జగన్, మమత, స్టాలిన్‌లతో మంచి సంబంధాలున్న ప్రశాంత్ కిషోర్ గట్టిగా ప్రయత్నిస్తే.. వచ్చే ఎన్నికల్లో మోదీకి గెలుపు కష్టం కావచ్చు కూడా.