శాసన మండలికి అనేక విధాలుగా సభ్యులు ఎన్నికవుతుంటారు. కొందరిని ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. ఇంకొందరిని కేవలం గ్రాడ్యుయేట్లు ఎన్నుకుంటారు. ఇంకొందరిని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. ఇంకొందరిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఇంకొందరని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఇలా విభిన్నమార్గాల్లో ఎన్నికైన వారు శాసన మండలిలో ఉంటారు.
ఇక ఇందులో అన్నింటి కంటే ప్రత్యేకమైంది.. గవర్నర్ కోటా .. సమాజంలోని మేధావులు, శాస్త్రవేత్తలు, కవులు, కళాకారులు వంటి వారు నేరుగా చట్టసభలకు ఎన్నిక కాలేరు. అందుకే అలాంటి వారి సేవలను వినియోగించుకునేందుకు ఇలా గవర్నర్ ద్వారా నామినేట్ చేస్తారు. అలా నామినేట్ అయిన వారు తమ అనుభవంతో, పాండిత్యంతో ప్రజలకు మేలు చేసే ఆలోచనలు చేస్తారు. ఇదీ గవర్నర్ కోటా వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.
అయితే ప్రస్తుతం ఏం జరుగుతుందంటే.. ఈ నామినేటెడ్ కోటా కూడా రాజకీయ పునరావస కేంద్రంగా మారుతోంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని వాళ్లకు.. గతంలో హామీ ఇచ్చిన వాళ్లకు పార్టీల అధినేతలు ఇలా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇచ్చి సంతృప్తి పరుస్తున్నారు. తాజాగా జరిగింది అదే.. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక రీత్యా కీలకమైన కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి పార్టీలో చేర్చుకున్న కేసీఆర్.. ఆయనకు ఏదో ఒక అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. వెంటనే.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా కేసీఆరే కాదు.. అటు జగన్ కూడా ఇదే తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా మేధావులు మండలిలో అడుగు పెట్టలేకపోతున్నారు.