ఈ క్రమంలోనే పార్టీలో కీలక పదవి అయిన తెలుగు మహిళ అధ్యక్ష పదవి విషయంలో కూడా చంద్రబాబు ఎవరిని అయితే నమ్మి పదవి ఇస్తున్నారో ? వారే ఆయనకు దెబ్బతీస్తున్నారు. ముందుగా చంద్రబాబు ఈ పదవిని జయప్రదకు కట్టబెట్టారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు అధికార బదలాయింపు జరిగినప్పుడు జయప్రద కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే బాబు ఆమెను రాజ్యసభకు పంపారు. అయితే రెండోసారి జయప్రదను రాజ్యసభకు పంపక పోవడంతో అలిగిన ఆమె ఆ పదవి నుంచి తప్పుకుని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
చాలా గ్యాప్ తర్వాత సినీ నటి రోజాకు ఈ పదవి ఇచ్చారు. ఈ పదవితోనే రాజకీయాల్లో రోజా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రోజాకు చంద్రబాబు రెండుసార్లు టికెట్ ఇచ్చినా ఆమె ఓడిపోయారు. అయితే నగిరి లో కాకుండా చంద్రగిరిలో సీటు ఇచ్చారని ఆమె కూడా బాబును విమర్శించి పార్టీ మారిపోయారు. ఇప్పుడు రోజా చంద్రబాబు అన్నా.. లోకేష్ అన్నా తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మరో మాజీ తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి సైతం టీడీపీకి గుడ్ బై చెప్పేశారు.
ఏయూలో ఉద్యోగిగా ఉన్న ఆమెను 1999 ఎన్నికల్లో చంద్రబాబు ఎస్.కోట నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యే చేశారు. ఆ తర్వాత ఆమె సేవలను గుర్తించి తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా చేశారు. ఇక ఆమె కుమార్తె శోభా స్వాతీరాణిని విజయనగరం జడ్పీ చైర్మన్ గా కూడా చేశారు. ఇవన్నీ మర్చిపోయి శోభా హైమావతి టిడిపిలో తనకు గౌరవం లేదని పార్టీని వీడారు. ఏదేమైనా చంద్రబాబుకు పార్టీ మహిళా అధ్యక్షురాలు పదవి అచ్చి రావడం లేదనే చెప్పాలి.