ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ దళితబంధు పేరుతో ఏకంగా ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తామంటూ ఎస్సీ ఓట్లపై వల వేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దళిత, గిరిజన దండోరా అంటూ దళితులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు బీఎస్పీ కూడా ప్రవీణ్ కుమార్ రూపంలో రంగంలోకి దిగింది. మరి ఇప్పుడు తెలంగాణలో దళితులు ఎవరి వెంట ఉంటారు.. ఎవరి మాటలు నమ్ముతారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారు అన్నది ఆసక్తికరంగా తయారైంది.
అయితే తెలంగాణలో మొదటి నుంచి దళితులు కాంగ్రెస్ వెంట ఎక్కువగా ఉండేవారు. మరి ఇప్పుడు ఆరెస్పీ రాకతో కాంగ్రెస్‌కు దళితులు దూరమవుతారా.. ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే.. ఆయన చెప్పిన సమాధానం షాకింగ్‌గా ఉంది. తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవన్నీ అల్టిమేట్ గా కాంగ్రెస్‌కే లాభం చేకూరుస్తాయని రేవంత్ రెడ్డి సూత్రీకరిస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన శత్రువు కాంగ్రెస్ కాబట్టి.. మిగిలిన ఏ విపక్షం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేసినా.. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మాత్రమే ఓటర్‌కు కనిపిస్తుందంటున్నారు.
పార్టీ పెట్టిన వెంటనే కేసీఆర్‌ను టార్గెట్ చేసిన ఆరెస్పీ వైఖరితో కాంగ్రెస్‌కే లాభం అంటున్నారు రేవంత్ రెడ్డి. ఆరెస్పీతో మేం చాలా హ్యాపీ అని చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ వాదనలో ఎంత వరకూ నిజం ఉందో.. నిలకడ మీద తెలుస్తుంది.. ఏమంటారు..?