వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ యువ‌నేత రాహుల్ గాంధీ ఏపీ లోని విశాఖ  ఎంపీ స్థానం నుంచి బ‌రిలోకి దిగ‌నున్నారా..? ప్ర‌స్తుతానికి ఇది ఊహాగాన‌మే అయినా త‌మ పార్టీ ఆశా కిర‌ణ‌మైన రాహుల్ ను ఇందుకు ఒప్పిస్తామ‌ని, ఇది జ‌రిగి తీరుతుంద‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయ‌కులు గ‌ట్టి న‌మ్మ‌కం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర విభ‌జ‌న అన్యాయంగా జ‌రిగింద‌న్నఏపీ ప్ర‌జ‌ల ఆవేద‌న‌, అందుకు కార‌ణ‌మైన కాంగ్రెస్ పార్టీపై ఆగ్ర‌హంగా మార‌డంతో గ‌డ‌చిన రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి ప్ర‌శ్నార్థకంగా మారింది. దుర‌దృష్ట‌మేమిటంటే చేసిన త‌ప్పును సరిదిద్దుకుని, ఏపీకి విభ‌జ‌న హామీలు అమ‌లు చేసే అవ‌కాశ‌మూ లేకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ అధికారానికి దూర‌మైంది. ఇక తెలంగాణ‌ రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్ కూడా ఆ పార్టీకి ద‌క్క‌క‌పోగా, తెచ్చిన పార్టీగా ఆ ఘ‌న‌త‌ను టీఆర్ఎస్ త‌న ఖాతాలో వేసుకుని అధికారాన్నికైవ‌సం చేసుకుంది.

       అయితే విభ‌జ‌న హామీల అమ‌లులో కేంద్రంలోని బీజేపీ మ‌రింత అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ఏపీ ప్ర‌జ‌లు ఆ పార్టీపైనా తీవ్ర ఆగ్ర‌హంగా ఉండ‌టం కాంగ్రెస్ పార్టీకి కొంత‌లో కొంత ఊర‌ట‌. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాహుల్ గాంధీని విశాఖకు ర‌ప్పించి ఇక్క‌డ నుంచి పోటీ చేయించ‌డం ద్వారా ఏపీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై త‌మ‌కు పూర్తి అవ‌గాహ‌న ఉంద‌ని కాంగ్రెస్ అధిష్ఠానం తెలియ‌జేసిన‌ట్ట‌వుతుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు. అంతేకాకుండా తాము కేంద్రంలోకి అధికారానికి వ‌చ్చాక  పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామ‌ని భావి ప్ర‌ధానిగా రాహుల్ స్వ‌యంగా భ‌రోసా ఇవ్వ‌డం ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి అందించిన‌ట్ట‌వుతుంద‌ని కూడా కాంగ్రెస్ నాయ‌కులు చెపుతున్నారు. గ‌తంలో ఇందిరాగాంధీ రాజ‌కీయంగా క‌ష్ట‌కాలంలో ఉన్న‌స‌మ‌యంలో ఉమ్మ‌డి ఏపీలోని మెద‌క్ స్థానం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించార‌ని,  ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప్ర‌ధానిగా గెలిచి పున‌ర్వైభ‌వం సాధించిన విష‌యాన్ని వారు ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇక వైజాగ్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ అంశంలో బీజేపీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ఆ సంస్థ ఉద్యోగులు, అక్క‌డి ప్ర‌జ‌లు రాహుల్ గాంధీ వ‌స్తే ఆయ‌న వెంట నిలుస్తార‌ని, ఇక కాంగ్రెస్ పార్టీ సంప్ర‌దాయ ఓటు బ్యాంకు తిరిగి రావ‌డం ద్వారా ఆయ‌న గెల‌వ‌డం కూడా త‌థ్య‌మ‌ని వారంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా కంచుకోట‌గా ఉన్న అమేధీ నుంచి మ‌రోసారి పోటీ చేసిన రాహుల్‌ తొలిసారిగా ఓట‌మి రుచి చూసిన విష‌యం తెలిసిందే. అయితే కేర‌ళ లోని వైనాడు నుంచి గెలిచి ఆయ‌న లోక్ స‌భ‌లో అడుగుపెట్టారు.  ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైజాగ్  నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: