
ఎల్బీనగర్, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చైతన్యపురిలో కంచర గాడిదలకు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మల్ రెడ్డి రాంరెడ్డి, దేప బాస్కర్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కంచర గాడిద పాలన కొనసాగుతుందని వారు అన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రతి రోజు రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు చేసుకోవడం సిగ్గు చేటు అన్నారు.
అది కూడా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు మూడు రోజులు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునివ్వడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కనీసం ఈ పుట్టినరోజుకైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోని సుపరిపాలన అందించాలని వారు అంటున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అయితే కేసీఆర్ బర్త్ డే రోజు ఇలా గాడిదలతో కార్యక్రమాలు నిర్వహించడం వివాదాస్పదం అవుతోంది.
ప్రత్యేకించి కేసీఆర్ అంటే ఓ రేంజ్‌లో మండిపడే రేవంత్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలకు పిలుపు ఇవ్వడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎంత వరకైనా ఎదుర్కోవచ్చని.. కానీ.. ఇలా చౌకబారు ప్రచారంతో ఎత్తులతో రేవంత్ రెడ్డి ఉన్న కాస్త పేరు కూడా పోగొట్టుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. సరైన రాజకీయం అంశాలపై పోరాడం ద్వారా పార్టీని బలంగా జనంలోకి తీసుకెళ్లాలని.. అంతే తప్ప.. ఇలాంటి చిల్లర రాజకీయాలు పీసీసీ అధ్యక్షుడి స్థాయికి తగవన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.