వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజకీయ మేధావిగా పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్ సాయం చేయబోతున్నారా.. రాజకీయాల్లో రాణించాల్సన ఎత్తుగడలన షర్మిలకు ఉండవల్లి అందించబోతున్నారా.. తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో క్రైస్తవ మత ప్రచారకుడు, షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ కలవడం చూస్తే ఈ అనుమానాలు కలుగకమానవు. రాజమండ్రిలోని ఉండవల్లి నివాసంలో నిన్న వీరిద్దరూ గంటసేపు సమావేశం అయ్యారు.


ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అనిల్.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై అరుణ్‌కుమార్‌తో చర్చించామని తెలిపారు. తనకు రాజకీయాలు బొత్తిగా తెలియవని.. వాటి గురించి కొంచెం నేర్చుకోవడానికి వచ్చానని అనిల్ చెప్పడం చూస్తే.. ఉండవల్లి ఆయనకు పొలిటికల్ కోచింగ్ ఇస్తున్నారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంతే కాదు.. ఉండవల్లితో ఏం చర్చించారు అని అడిగితే.. తమ సీక్రెట్స్‌ తమకు ఉన్నాయని అనిల్ కామెంట్ చేయడం విశేషం.


అంతేకాదు.. సమయం వచ్చినపుడు ఆ సీక్రెట్స్ అన్నీ బయటకు వస్తాయని అనిల్‌ వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది. ఉండవల్లి మాత్రం పాత పరిచయాలతో అన్ని విషయాలూ మాట్లాడుకున్నామని మీడియాతో అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్‌కు మంచి రాజకీయ మేధావిగా పేరుంది. కేవలం రాజకీయం తప్ప ఇతర వ్యాపకాలు లేని ఉండవల్లి అరుణ్ కుమార్‌ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాలను బాగా అధ్యయనం చేస్తుంటారు.


గతంలో వైఎస్సార్‌  బతికున్నప్పుడు ఆయనకు రాజకీయ సలహాలు అందించేవారు ఉండవల్లి. ఉండవల్లిని వైఎస్సార్ తన కుటుంబ సభ్యుడిగా చూసుకునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వైఎస్సార్  అండలేకపోతే ఉండవల్లి వంటి వ్యక్తికి రాజమండ్రి ఎంపీ సీటు దక్కేదే కాదు.. ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు ఉండవల్లి వైఎస్ షర్మిలకు రాజకీయ గురువుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. తెలంగాణలో పాగా వేసేందుకు ఉర్మిళ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నా అంత సానుకూల పరిణామాలు మాత్రం చోటు చేసుకోవడం లేదు. ఇంకా ఆమెను తెలంగాణ పార్టీలు కూడా ఒక ప్రత్యర్థిగా భావించట్లేదు. ఇలాంటి సమయంలో ఉండవల్లి కోచించ్ షర్మిలకు ఉపయోగపడవచ్చేమో..?

మరింత సమాచారం తెలుసుకోండి: