వైసీపీ అధినేత సీఎం జగన్.. సీఎంగా తన మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ పాలనపై మీడియా.. ప్రత్యేకించి టీడీపీ అనుకూల మీడియాలో నెగిటివ్ కథనాలు బాగా పెరిగాయి. ప్రత్యేకించి మూడు మీడియా సంస్థలు తనపై కత్తి కట్టాయని ఏకంగా సీఎం జగన్ పదే పదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సదరు మీడియా సంస్థలు కూడా జగన్‌ తో ఢీ అంటే ఢీ అన్నట్టు కథనాలు ఇస్తున్నాయి. ప్రత్యేకించి.. ఏపీ జగన్ పాలనలో ఆర్థికంగా కుదేలైంది.. అప్పులు పెరిగిపోయాయని.. రాబడి బాగా తగ్గిపోయిందని.. కనీసం రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవని.. వివిధ సంస్థల రూపంలో జగన్ అప్పులు బాగా చేశారని.. మొత్తం మీద ఏపీ అప్పుల కుప్పలా తయారైందని సదరు మీడియా సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి.


అయితే.. ఆ మీడియా సంస్థలు చెబుతున్నంత దారుణంగా ఏపీ పరిస్థితి లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఏపీలో క్రమంగా రాష్ట్ర సొంత ఆదాయం పెరుగుతోందని.. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో రూ.57,000 కోట్ల చొప్పునే రాబడి ఉందని.. 2021-22లో సవరించిన అంచనాల ప్రకారం రూ.73,690 కోట్ల రాబడి ఉందని.. పన్నేతర ఆదాయంలోనూ గణనీయ మార్పు వచ్చిందని.. ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతోనే ఈ పెరుగుదల సాధ్యమైందని.. తాజాగా విడుదలైన సామాజిక ఆర్థిక సర్వే వెల్లడిస్తోంది.


సామాజిక ఆర్థిక సర్వే రిపోర్టును అధ్యయనం చేస్తే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని అర్థం అవుతోంది. కరోనాతో ఏర్పడ్డ సంక్షోభం నుంచి ఏపీ క్రమంగా గట్టెక్కుతున్నట్టు సామాజిక ఆర్థిక సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం పెరగడం ఇందుకు సూచనగా భావించవచ్చు. 2019-20లో రాష్ట్ర ఆదాయం ఆశించిన స్థాయిలో రాలేదని.. 2020-21లో కోవిడ్‌ లాక్‌డౌన్, ఆంక్షలతో రాష్ట్ర సొంత ఆదాయం భారీగా పడిపోయినట్టు సామాజిక ఆర్థిక సర్వే చెబుతోంది. తాజాగా కోవిడ్‌ తగ్గుముఖం పట్టడం.. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వంటి కారణాలతో 2021-22లో సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత ఆదాయం రూ.73,690 కోట్లకు చేరుతుందట. సో.. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. మరీ కొన్ని మీడియా సంస్థలు చెప్పినట్టు భయంకరంగా ఏమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: