ఔను..! ఓట‌ముల నుంచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేర్చుకున్న‌ది ఏమైనా ఉందా ?  గెలుపు వ్యూహంతో ముందుకుపోవ‌డంలో బాగానే ఉన్నా.. ఓట‌ముల నుంచి ఆత్మావ‌లోకనం చేసుకున్న ప‌రిస్థితి క‌నిపిస్తోందా ? ఇదీ.. ఇప్పుడు చ‌ర్చ‌కు వస్తున్న విష‌యం. దీనికి కార‌ణం.. టీడీపీ మ‌రో నాలుగు రోజుల్లో 40వ వ‌సంతంలోకి అడుగులు వేస్తోంది. ఒక పార్టీకి 40 ఏళ్లు రావ‌డం అంటే.. అంత ఈజీకాదు. అందునా.. ప్రాంతీయ పార్టీల చ‌రిత్ర‌ను తీసుకుంటే.. ఎంజీఆర్ స్తాపించిన‌.. డీఎంకే త‌ర్వాత‌.. అంత చ‌రిత్ర ఉన్న పార్టీ టీడీపీ అనే చెప్పాలి. అందునా.. భిన్న‌మైన వ్య‌క్తులు.. విభిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలు ఉన్న ప్ర‌జ‌ల‌తో నిండిన ఉమ్మ‌డి ఏపీలో పుట్టిన పార్టీ 40 ఏళ్ల వ‌సంతం చేసుకోవ‌డం.. చాలా రికార్డ‌నే చెప్పాలి.

ఈ క్ర‌మంలోనే.. టీడీపీ విష‌యాన్ని తీసుకుంటే.. కేవ‌లం గెలుపు వ్యూహ‌మే కాదు.. ఓట‌ముల నుంచి ఎంత నేర్చుకుంది?  ఏం నేర్చుకున్న‌ది అనే విష‌యం పార్టీ సానుభూతి ప‌రుల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే.. పార్టీ అన్నాక గెలుపు, ఓట‌ములు స‌హ‌జం. అయితే.. గెలిచిన‌ప్పుడు.. త‌నంత‌వాడు లేడ‌నే ధోర‌ణిలోనే.. టీడీపీ నాయ‌కులు.. వ్య‌వ‌హ‌రించార‌నే వాద‌న ఉంది. ముఖ్యంగా పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన చంద్ర‌బాబు హ‌యాంలో ఈ వాద‌న బ‌లంగా వినిపించింది. ఆయ‌న‌లో ఎన్ని మెరుగైన ల‌క్షణాలు ఉన్నా.. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఒక‌ర‌కంగా.. పార్టీ అధికారం కోల్పోతే మ‌రో ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారనే విమ‌ర్శ‌లు చాలా ఏళ్లుగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉంటే.. త‌న చుట్టూ ఒక కోట‌రీని ఏర్పాటు చేసుకుని.. వారు చెప్పిందే వేదంగా.. త‌న‌కు తోచిందే.. పాల‌న‌గా వ్య‌వ‌హ‌రిస్తారని సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వున్నాయి.

ఇక‌, పార్టీ ఓడిపోతే మాత్రం కార్య‌క‌ర్త‌ల‌పై ఆధార‌ప‌డిపోవ‌డం.. వారు లేక‌పోతే.. తాను లేన‌ని చెప్ప‌డం వంటివి ఇటీవ‌ల కాలంలోనూ చూస్తున్నాం. నిజానికి గెలిచినా.. ఓడినా.. ఏ పార్టీకైనా.. కూడా కార్య‌క‌ర్త‌లు, క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు అత్యంత కీల‌కం. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు ఎక్క‌డో మిస్ అవుతున్నారు. అందుకే.. ప్ర‌తిసారీ.. పార్టీ ఓట‌మి విష‌యంలో.. కార్య‌క‌ర్త‌ల‌ను న‌మ్ముతున్నారు. అధికారంలోకి తెచ్చేందుకు వారిపైనే ఆధార‌ప‌డుతున్నారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మాత్రం వేరే వ‌ర్గాల‌ను ఆయ‌న చేర‌దీస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వున్నాయి.

గ‌తంలో అన్న‌గారి హ‌యాంలో ఇంతగా ఉండేది కాద‌ని.. క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసిన ఎంతో మందికి అన్న‌గారు గుర్తింపు ఇచ్చార‌ని సీనియ‌ర్లు ఇప్ప‌టికీ వాద‌న వినిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. ఓట‌మి నుంచి నేర్చుకుఏ పాఠాల‌ను గ‌మ‌నించి.. ముందుకు అడుగులు వేయ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని సునాయాసంగా అధికారంలోకి తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ 40వ వ‌సంతం వేదిక‌గా.. ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: