భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లాను ఏర్పాటు చేయడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. నరసాపురం జిల్లా కేంద్రం కావాలని కొన్నాళ్లుగా ఉద్యమాలు చేశారు. కానీ జగన్ వాటిని పట్టించుకోలేదు. రెండు రెవెన్యూ డివిజన్లతో భీమ వరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లానే ఏర్పాటు చేశారు. నర్సాపురం, భీమవరం రెవెన్యూ డివిజన్లతో ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటైంది. ఈ జిల్లాలో 19 మండలాలు ఉన్నాయి.
అలాగే పుట్టపర్తి జిల్లా కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటుపైనా అభ్యంతరాలు వచ్చాయి. బాలకృష్ణ హిందూపురాన్ని జిల్లా చేయాల్సిందే అంటూ ఉద్యమాలు చేశారు. నిరాహార దీక్ష చేశారు. కానీ జగన్ నిర్ణయం మాత్రం మారలేదు. ధర్మవరం, కదిరి,పుట్టపర్తి, పెనుకొండ రెవెన్యూ డివిజన్లతో సత్యసాయి జిల్లా ఏర్పాటైంది. 32 మండలాలతో సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. అనంత జిల్లాలోని ధర్మవరం, కదిరి, పెనుకొండ రెవెన్యూ డివిజన్లల్లోని మండలాలతో సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు.
అలాగే.. రాయచోటి కేంద్రం గా అన్నమయ్య జిల్లా ఏర్పాటును కూడా వ్యతిరేకించారు. జిల్లా ఓకే అయినా జిల్లా కేంద్రం రాజంపేటగా ఉండాలని కోరారు.. కానీ జగన్ ఈ విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు. రాజంపేట, రాయచోటి, మదనపల్లె రెవెన్యూ డివిజన్లతో అన్నమయ్య జిల్లా ఏర్పాటైంది. అలాగే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని కొన్ని రోజులుగా అక్కడ ఉద్యమం చేస్తున్నా వారి విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు. మొత్తానికి జగన్ తాను అనుకున్నదే ఫైనల్ చేసేశారు.