ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నారు. నిన్న సోనియా, రాహుల్ గాంధీలను కలిసిన ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే.. తన చేరికకు ఆయన కొన్ని కండిషన్లు పెట్టినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్‌ కోసం ఓ యాక్షన్ ప్లాన్ రీడ చేశారు. ఆ ప్లాన్‌ను సోనియా, రాహుల్ గాంధీలకు వివరించినట్టు తెలుస్తోంది. తాను ఏమీ ఆశించకుండానే పార్టీలో చేరతానని పీకే అన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


అయితే కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు తాను సూచించే ప్లాన్ మాత్రం తప్పకుండా అమలు చేయాలని ప్రశాంత్‌ కిశోర్‌ సోనియా, రాహుల్‌కు పక్కాగా చెప్పేశారట. ఇంతకీ ఈ యాక్షన్ ప్లాన్ ఏంటో తెలుసా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 365-370 ఎంపీ స్థానాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టాలి. ఇప్పట్నుంచే ఆయా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలట. అలాగే కాంగ్రెస్‌ బలంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ  చేయాలట. ఆయాచోట్ల వీలైనంత వరకూ అగ్ర స్థానంలో నిలవాలట. అలా కుదరకుంటే కనీసం రెండో స్థానంలో నిలిచేందుకు గట్టి కృషి చేయాలట.


ఇక మూడో సూత్రం ఏంటంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా రాష్ట్రాల్లో పార్టీని కొత్త విధానంలో నడిపించాలట. నాలుగో సూత్రం ఏంటంటే.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు అక్కడి పాటిదార్‌ వర్గానికి చెందిన నేత నరేశ్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ లోకి తీసుకోవాలట.. ఇవీ ప్రస్తుతానికి పీకే ప్లాన్ నుంచి లీకైన కొన్ని విషయాలు. అయితే.. పీకే సూచనలను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీకే చేసిన సూచనలపై అధ్యయనానికి సోనియా ఓ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తారట. వారం రోజుల్లో ఆ బృందం తన పరిశీలన నివేదిక సోనియాకు ఇస్తుందట. అయితే.. ప్రశాంత్ కిషోర్‌  కేవలం సలహాదారుగానే ఉంటారా.. కాంగ్రెస్‌లో చేరతారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: