ఈ పథకం ద్వారా వీలైనంత వరకు ఎక్కువ మందికి అవకాశం కల్పించడం కోసం నియమావళి సవరించామని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకంలో అర్హత పొందిన వారిలో 81 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. 2019–20లో బీసీలు 46.53 శాతం, ఎస్సీలు 20.67 శాతం అమ్మ ఒడి వచ్చిందట. అలాగే ఎస్టీలు 6.58 శాతం, మైనారిటీలు 7.17 శాతం మందికి అమ్మ ఒడి వచ్చిందట. అంటే.. మొత్తం కలిపి 80.95 ఆ వర్గాలకు అమ్మ ఒడి దక్కిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ఇక . 2020–21లో ఈ అమ్మ ఒడి పథకంలో లబ్ధి పొందిన వారిలో 52 శాతం బీసీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పథకంలో అర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. అన్ని అమ్మ ఒడి జాబితాలు సామాజిక తనిఖీ కోసం సచివాలయాల్లో ప్రదర్శిస్తోంది ప్రభుత్వం. ఇక విద్యార్థుల హాజరుకు సంబంధించి కొత్తగా నియమావళి ఏం మార్చలేదని ప్రభుత్వం చెబుతోంది.
75 శాతం హాజరు ఉండాలనే నిబంధన ఇప్పటిది కాదని.. తొలి జీఓ నెం:63లోనే ఆ రూల్ ఉందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. అమ్మ ఒడి పథకాన్ని విద్యా సంవత్సరం మధ్య 2020 జనవరిలో ప్రారంభించడం వల్ల తొలి ఏడాది హాజరు శాతానికి సంబంధించి ఉన్న నిబంధనను సడలించింది. ఇక ఆ తర్వాత కరోనా వల్ల 2020–21 విద్యా సంవత్సరంలో తరగతులే నిర్వహించలేనందున ఆ నిబంధన వర్తించలేదు.