వైఎస్‌ షర్మిల తన అన్న జగన్‌పై కోపంతో ఉన్నారని కొన్నాళ్లుగా జగన్ వ్యతిరేక మీడియా కోడై కూస్తోంది. అంతే కాదు.. షర్మిల ఏపీలోనూ పార్టీ పెట్టబోతున్నారని ఆ మీడియా ప్రచారం చేస్తోంది. ఇటీవల కేటీఆర్ కూడా షర్మిల అన్నపై కోపంతో తెలంగాణలో పార్టీ పెట్టిందని కామెంట్ చేశారు. దీనిపై ఎట్టకేలకు షర్మిల స్పందించింది. భద్రాచలంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల... తెలంగాణలో తాను పార్టీ పెట్టడానికి అసలు కారణం కేసీఆరేని తేల్చి చెప్పారు.


కేసీఆర్‌ దిక్కుమాలిన పాలన వల్లే తెలంగాణలో పార్టీ పెట్టానన్న షర్మిల.. అన్న మీద కోపంతో ఇక్కడ పార్టీ పెట్టానన్న కేటీఆర్‌ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. తాను అత్త మీద కోపం దుత్త మీద చూపించే వ్యక్తిని కాను అంటూ క్లారిటీ ఇచ్చేశారు. అన్న మీద కోపం ఇక్కడ చూపిస్తే లాభం లేదనే ఇంగితజ్ఞానం తనకు ఉందన్న షర్మిల.. కేటీఆర్‌ మాటల్లో నిజం లేదు కాబట్టే...అక్కడ పార్టీ పెట్టలేదని మరింత స్పష్టత ఇచ్చేశారు. తమకు ఎవరితోనూ పొత్తులు లేవు, తాము ఎవరికీ ఏజెంట్లు కాదని వైఎస్ షర్మిల అన్నారు.


తాను కేవలం టీఆర్ఎస్‌ ఓట్లే కాదు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఓట్లు కూడా చీలుస్తానని షర్మిల అన్నారు. తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల చాలా రోజుల తర్వాత జగన్ పార్టీపై ఓ క్లారిటీ ఇచ్చారు. ఆమె గతంలో ఏం.. ఏపీలో తాము పార్టీ పెట్టకూడదా అన్నట్టు వ్యాఖ్యానించిందని వార్తలు వచ్చాయి కూడా. అప్పటి నుంచి ఆమె ఏపీలోనూ పార్టీ పెడుతుందేమో అన్నంతగా ప్రచారం సాగింది.


కానీ ఇప్పుడు భద్రాచలం సభలో ఇచ్చిన క్లారిటీతో ఇక మరోసారి ఎవరూ ఈ మాట అనకుండా ఆమె జాగ్రత్త పడ్డారు. అయితే.. తెలంగాణలో రాజకీయాల్లో ఇంకా వైఎస్ షర్మిల ఏమాత్రం ముద్ర వేయలేకపోయారని చెప్పాలి. తెలంగాణలో వచ్చే ఏడాదే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇంకా పుంజుకోని పక్షంగా ముందు ముందు వైఎస్సార్ తెలంగాణ పార్టీ గురించి ఆలోచించే వారు ఎవరూ ఉండరేమో అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ షర్మిల మాత్రం పట్టువిడవకుండా తన పాదయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: