ఏపీలో రోడ్లు, విద్యుత్, నీరు వంటి సమస్యలు దారుణంగా ఉన్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వైసీపీ మంత్రులు ఘాటుగానే స్పందించారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా దీనిపై కాస్త వివరణ ఇచ్చుకున్నారు. ఏదో యథాలాపంగా అన్నా.. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదని సర్ది చెప్పుకున్నారు. అయినా ఈ వ్యాఖ్యలు సీఎం జగన్‌ను కూడా హర్ట్ చేసినట్టున్నాయి. తాజాగా  జరిగిన ఓ సమీక్షలో గ్రామీణ ప్రాంతాల్లో  రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.


గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు వెంటనే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వెంటనే టెండర్లు నిర్వహించి , ఈ నెల 20 కల్లా రోడ్ల పనులు ప్రారంభించాల్సిందేనని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌ పక్కాగా ఉండాలని, ఊర్లన్నీ శుభ్రంగా  కనిపించాలని జగన్ ఆదేశించారు.


ప్రతి పంచాయతీకి చెత్త తరలింపునకు ట్రాక్టర్‌ ఉండేలా ఏర్పాట్లు చేయాలని.. వైఎస్ ఆర్ జలకళ కింద  ఐదు ఎకరాలలోపు ,అర్హత ఉన్న రైతులకు అన్ని రకాల సౌకర్యాలతో ఉచిత బోరు వేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రధానంగా గ్రామీణ రహదారులు, తాగునీరు వంటి కీలక అంశాలపై చర్చించారు.


గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు వెంటనే 1073 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని 9 వేలకిలోమీటర్ల రోడ్లు మరమ్మత్తులు వెంటనే చేయాలని సూచించారు. అతి త్వరగా రోడ్లు పనులు ప్రారంభించే చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. మరి ఇదంతా కేటీఆర్ కామెంట్ల ప్రభావమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: