కేసీఆర్ మాయల మరాఠీ అన్న సంగతి తెలిసిందే.. కానీ.. కరడు కట్టిన సమైక్య వాది ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను సైతం కేసీఆర్‌ బుట్టలో వేశారంటే.. ఆయన చాణక్యం మామూలుది కాదనుకోవచ్చు. తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.. కేసీఆర్‌ను కలిశారు.. ఆయనతో కొన్ని గంటల పాటు చర్చించారు. దేశంలో బీజేపీకి చెక్‌ పెట్టే అంశంపై ఇద్దరూ కొద్ది గంటలసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రాజమండ్రి వెళ్లిన ఉండవల్లి అక్కడ ప్రెస్ మీట్‌ పెట్టారు.


ఉండవల్లి ప్రెస్ మీట్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కేసీఆర్‌ను పొగిడిన తీరు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే.. ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కు మేధావిగా పేరుంది. ఆయన అంత సులభంగా ఎవరినీ పొగడరు.. అలాంటి వ్యక్తి కూడా కేసీఆర్‌ను కలిసి వచ్చాక.. ఈ దేశంలో మోడీని అడ్డుకునే వ్యక్తి కేసీఆర్ మాత్రమే అంటూ కితాబిచ్చిన తీరు చూస్తే.. వామ్మో కేసీఆర్‌ అనిపించక మానదు.


భారత దేశ రాజకీయాలపై కేసీఆర్‌కు సంపూర్ణ స్పష్టత ఉందంటున్న ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.. దేశంలో పరిస్థితులపై కేసీఆర్ వద్ద సమగ్ర సమాచారం ఉందని మెచ్చుకున్నారు. మోదీకి దీటైన వాక్పటిమ గల నాయకుడు కేసీఆర్‌ మాత్రమేనని.. ఆయన ఏ విషయాన్నైనా ప్రజలకు అనర్గళంగా అర్థమయ్యేలా చెప్పగలిగే నేత అంటూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం మోదీ గురించి ధైర్యంగా మాట్లాడుతున్న ఏకైక నేత కేసీఆర్ మాత్రమేనని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అంటున్నారు.


ఈ దేశానికి బీజేపీ అత్యంత ప్రమాదకారి అంటున్న అరుణ్‌ కుమార్.. ఆ పార్టీకి వ్యతిరేకంగా బలంగా గొంతెత్తాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సర్వత్రా వ్యతిరేకత వస్తోందని.. మోదీ నియంతలా దేశాన్ని పరిపాలిస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఉండవల్లి  అరుణ్‌ కుమార్‌ ప్రెస్ మీట్ చూస్తే.. ఆయన పూర్తిగా కేసీఆర్‌ పట్ల ఆరాధానాభావంతో మాట్లాడటం ఆశ్చర్యం కలిగించక మానదు.


మరింత సమాచారం తెలుసుకోండి: