అమర్‌నాథ్‌ యాత్ర కొనసాగుతున్న వేళ ప్రకృతి ఒక్కసారిగా విరుచుకుడింది. ఆకస్మిక వరదలు అమర్‌నాథ్‌ గుహ కింద ప్రాంతాలను ఒక్కసారిగా ముంచెత్తాయి. ముంచుకొచ్చిన ఉప్పెన  యాత్రికుల గుడారాలను ముంచెత్తింది. ఈ దారుణ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ప్రాణనష్టం మరింత పెరిగే ప్రమాదం ఉంది. 50 మంది వరకూ గల్లంతైనట్టు తెలుస్తోంది.


అసలు ఈ మెరుపు వరదలకు కారణం ఏంటి.. ఈ అంశంపై ఇప్పుడు అంతా ఆలోచనలో పడ్డారు.  స్వల్ప వ్యవధిలో కురిసిన అతి భారీ వర్షాల కారణంగానే ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. గుహ వద్ద ఒక్కసారిగా పోటెత్తిన వరద ఈ విపత్తునకు కారణంగా తెలుస్తోంది. సాయంత్రం అయిదున్నరగంటల ప్రాంతంలో ఊహించని రీతిలో కొండలపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద వచ్చేసింది. గుహకు సమీపంలోని బేస్‌క్యాంప్‌ వద్ద యాత్రికుల గుడారాలను వరద నీరు ముంచెత్తింది.


ఈ వరదల ధాటికి అక్కడ భక్తులు వేసుకున్న పదుల సంఖ్యలో టెంట్లు ఒక్క ఉదుటున కొట్టుకుపోయాయి. ఊహించని పరిణామానికి భక్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.  ఇలాంటి  మెరుపు వరదలు ఇలాంటి కొండ ప్రాంతాల్లో కొత్తేమీ కాదు. కానీ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులకు మాత్రం కొత్తే కాబట్టి .. ఆ వరదలను చూసి షాక్‌లో ఉండగానే.. విపత్తు ముంచెత్తింది.


ఈ ఆకస్మిక వరదల కారణంగా అమర్‌ నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అమర్‌నాథ్ గుహ వద్ద సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సహాయ చర్యల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు. గల్లంతైన వారికోసం గాలింపు  చర్యలు ఇంకా కొనసాగిస్తున్నాయి. ఈ అమర్‌నాథ్ యాత్రను రెండేళ్ల తర్వాత ప్రారంభించారు. రెండేళ్లుగా యాత్ర లేకపోవడంతో భక్తులంతా ఆసక్తిగా ఈ యాత్ర కోసం ఎదురు చూశారు. గతనెల 30న యాత్ర ప్రారంభమైంది. ఆగస్టు 11న ఈ అమర్‌నాథ్ యాత్ర పూర్తికానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: