ఇలా మునుగోడులో రాజకీయ మోహరింపులు పెరుగుతున్నాయి. ఇవాళ సీఎం కేసీఆర్.. మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభలో ఆయన మునుగోడు అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ భారీ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. 2014లో మొదటిసారి మునుగోడులో టీఆర్‌ఎస్ గెలిచింది. కానీ 2018 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు.
అయితే.. ఇటీవల తెలంగాణలో జోరు చూపుతున్న బీజేపీ ఇప్పుడు ఎలాగైనా మునుగోడు గెలుచుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఆత్మస్థైర్యంతో వెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలను చేజిక్కించుకున్న ఉత్సాహంతో మునుగోడు విజయంపై కన్నేసింది. ఏకంగా గత విజేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈసారి బీజేపీ నుంచి బరిలో దిగుతున్నందువల్ల విజయం సులభమే అన్న ఆలోచనలో ఉంది.
అటు కాంగ్రెస్ మాత్రం సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఆత్మ విశ్వాసంతో వెళ్లాలని యోచిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారిననా.. సంస్థాగతంగా మునుగోడుపై పార్టీకి ఉన్న పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చండూరులో పార్టీ సమావేశం నిర్వహించింది. మండల సమావేశాలను కూడా పూర్తి చేసింది. శనివారం రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహించనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నారాయణ్‌పూర్ మండలంలో పొర్లగడ్డ తండాకు రాబోతున్నారు. మొత్తానికి ఒక్కసారిగా మునుగోడులో పొలిటికల్ హీట్ పెరిగింది.