ఇకపై విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపైనా.. తిరుమల తరహా విధానాలు అమలు చేయబోతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులను పురస్కరించుకుని తొలిసారిగా వీఐపీల కోసం టైం స్లాట్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని దేవదాయ శాఖ ఆలోచిస్తోంది. ఈ విషయాన్నిరాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌, ఆలయ ఈవో భ్రమరాంబ ఇతర అధికారులతో మంత్రి ఇంద్రకీలాద్రిపై అమలు చేయాల్సిన సంస్కరణలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతాన్ని పూర్తిగా క్యూలైన్లతో భక్తులకు కేటాయించాలని భావిస్తున్నారు. అలాగే కనకదుర్ గనగర్‌ నుంచి లిఫ్ట్‌ మార్గంలో వీఐపీలను ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేయించాలని కూడా అధికారులు భావిస్తున్నారు. దీనికోసం ఐదు టైం స్లాట్‌లను ప్రతిపాదించినట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాకు వివరించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం.. ఇకపై ప్రతి ఎమ్మెల్యేలకు తనతోపాటు ఐదుగురికి ఉచిత దర్శనం కల్పిస్తారు. ఎమ్మెల్యేల లేఖలపై ఆరుగురికి అవకాశం ఉంటుంది.


విజయవాడలోని స్థానిక ఎమ్మెల్యేల నుంచి మరికొంత ఎక్కువ లేఖలకు అవకాశం ఇవ్వాలని కూడా  భావిస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అలాగే వీఐపీలకు వారికి నిర్దేశించిన టైం స్లాట్‌లో 1,800 నుంచి రెండు వేల మందికి దర్శనం చేయించే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో  దసరా వేళ దూరప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.


విజయవాడ ఘాట్ రోడ్డుపై అత్యవసర సమయాల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు వెళ్లేందుకు వీలుగా తగిన మార్గాన్ని ఖాళీగా ఉంచాలని భావిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందిస్తామంటున్నారు. పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం బఫే తరహాలో ప్రసాదం అందించాలని ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: