తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల బీజేపీ వ్యతిరేక విధానం అమలు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయినా సరే.. ఢీ అంటే ఢీ అనే రీతిలో ఛాలెంజ్ చేస్తున్నారు. నువ్వు గోక్కున్నా.. గోక్కోక పోయినా.. నేను మాత్రం గోకుతూనే ఉంటా అంటూ రైమింగ్‌ డైలాగులతో మోడీని సవాల్ చేస్తున్నారు. తాజాగా ఆయన పాట్నా వెళ్లి మరీ బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌తో భేటీ అయ్యారు. బీజేపీ ముక్త భారత్ కోసం అందరం ఏకం అవుతామంటున్నారు.


ఇలా కేసీఆర్ వ్యూహాలన్నీ చూస్తుంటే.. అచ్చం చంద్రబాబే గుర్తొస్తున్నారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇలాగే ప్రవర్తించేవారు.. అప్పటి వరకూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం.. అనూహ్యంగా ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది. అంతే కాదు.. ఏకంగా కేంద్రంతోనే పోరాటం అంటూ కొత్త పంథా ప్రారంభించింది. కేంద్రం ఏపీకి సహకరించట్లేదని ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ పోరాటం చేసింది.


అంతేనా.. కేంద్రం సీబీఐ, ఈడీలతో వేధిస్తోందని.. ఏపీలోకి సీబీఐ అడుగు పెట్టడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. సీబీఐ రాకకు అప్పటి వరకూ ఉన్న సమ్మతిని రద్దు చేసింది. ఇప్పుడు సేమ్ టు సేమ్‌ కేసీఆర్ కూడా అదే మాట అంటున్నారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కేసీఆర్‌ మండిపడుతున్నారు. రాజకీయంగా కక్ష సాధింపుల కోసం బీజేపీ సర్కారు వీటిని ఉపయోగిస్తోందని మండిపడుతున్నారు.


సీబీఐ, ఈడీ దాడులు ఆగాలంటే సీబీఐకి ఇచ్చిన సమ్మతిని అన్ని రాష్ట్రాలూ ఉపసంహరించుకోవాలని కేసీఆర్ పిలుపు ఇస్తున్నారు. పోలీసింగ్‌ అంశం రాష్ట్రాల పరిధిలోనిదని కేసీఆర్ గుర్తు చేస్తున్నారు. అసలు సీబీఐ ఏర్పడిందే.. దిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1946 సెక్షన్‌ ప్రకారం కాబట్టి దానికి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి దర్యాప్తు చేసే హక్కులేదంటున్నారు.  ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తు నిర్వహించాలంటే సీబీఐ ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. గతంలో సేమ్ డైలాగ్ చంద్రబాబు నోటి నుంచి కూడా వచ్చింది. ఆయన ఏపీ సీఎంగా ఉన్నప్పుడు సీబీఐకి ఇచ్చిన సమ్మతిని రద్దు చేశారు కూడా. మొత్తానికి కేసీఆర్ ను చూస్తే అచ్చం చంద్రబాబును చూస్తున్నట్టు ఉంది. మరి ఫ్యూచర్ ఏమవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: