రూబీ లాడ్జ్ లో అగ్నిప్రమాదం అంటూ 10:37కి ఫైర్ కాల్ వచ్చిందని.. స్కైలిఫ్ట్ తో పాటు ఒక ఫైర్ ఇంజిన్ 10:42 కి అక్కడికి చేరుకుందని అగ్నిమాపక శాఖ తెలిపింది. మరో 6 వాటర్ ట్యాంకర్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించామని.. గౌలిగూడ నుంచి అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయని.. మరో ఐదు వివిధ రకాల అగ్నామాపక శాఖ వాహనాలు అక్కడికి చేరుకున్నాయని.. అందరూ మంటలు ఆర్పేందుకు కృషి చేశారని అగ్నిమాపక శాఖ వివరించింది.
మంటలు ఆర్పేందుకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయన్న అగ్నిమాపక శాఖ.. దట్టమైన పొగల వల్ల ఏమీ కనింపించలేదని.. ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు భవనానికి మరో మెట్ల మార్గం లేదని తెలిపింది. బయటపడేందుకు ప్రత్యమ్నాయ సదుపాయం లేదని.. మంటలను ఆర్పేందుకు పరికరాలు ఉన్నాయి కానీ పనిచేయట్లేదని.. వ్యక్తిగత భద్రతా దుస్తులు, పరికరాలు ధరించి సిబ్బంది మంటలు ఆర్పారని అగ్నిమాపక శాఖ వివరించింది.
పొగలను నియంత్రించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారన్న అగ్నిమాపక శాఖ.. భవనానికి గాలి వెలుతురు వచ్చే వ్యవస్థ సరిగా లేదని.. వాణిజ్య అవసరాలకు, నివాసానికి ఒకే భవనాన్ని వాడటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని అగ్నిమాపక శాఖ తెలిపింది. అత్యవసర వెలుతురు సదుపాయం లేదని అగ్నిమాపక శాఖ వివరించింది. సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం భవన నిర్మాణదారులకు ఓ హెచ్చరిక అని.. భవన నిర్మాణదారులు ఇకపై అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలని.. అందుకు తగిన పరికరాలను సమకూర్చుకోవాలని తెలిపింది.