గుజరాత్‌లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈసారీ గెలుపు తమదేనని బీజేపీ ధీమాగా ఉంటే.. గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలని ఆప్‌ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో గుజరాత్‌లో అందరి కళ్లూ ఆ కులంపైనే ఉన్నాయి. ఆ కులమే పాటీదార్లు.. గుజరాత్ రాష్ట్రంలో పటేళ్లు చాలా ముఖ్యమైన కులం. గుజరాత్‌ జనాభాలో ఈ పటేల్ కులస్తుల సంఖ్య సుమారు 15 శాతం. గుజరాత్‌లో వ్యవసాయ భూమి వీరిచేతుల్లోనే ఉంటుంది.


పటేళ్లు వేరుశనగ, పత్తిలాంటి వాణిజ్య పంటలతో పటేళ్లు ఆర్థికంగా బాగా పుంజుకున్నారు. ఇత్తడి, సిరామిక్‌, వజ్రాలు, ఆటోమొబైల్‌, ఫార్మాలాంటి వ్యాపారాల్లోనూ పటేళ్లదే ఆదిపథ్యం. సహకార సంస్థల్లోనూ పటేళ్లదే హవా. గుజరాత్‌లోని  182 సీట్ల అసెంబ్లీలో 50 చోట్ల వీరి ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్‌ అని చెప్పొచ్చు. మరో 40 సీట్లలోనూ వీరు కీలక పాత్ర పోషిస్తారు. గుజరాత్‌లోని 50 నియోజకవర్గాల్లో పాటీదార్‌ ఓట్లు 20 శాతం పైగానే ఉన్నాయి.


మొదటి నుంచి బీజేపీకి అండగా నిలిచే ఈ పటేల్ వర్గం గత ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా మారింది. 2015లో పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి పేరుతో హార్దిక్‌ పటేల్‌ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి సీన్ మారింది. ఈ ఉద్యమం సమయంలో భాజపా ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించిందని పటేళ్లు అంటారు. ఉద్యమ సమయంలో పోలీసు కాల్పుల్లో అనేకమంది పాటీదార్‌ యువకులు చనిపోయారు. అందుకే పటేళ్లు అప్పుడు బీజేపీకి దూరమయ్యారు. అందుకే 2017 ఎన్నికల్లో బీజేపీ అతికష్టం మీద అధికారాన్ని నిలబెట్టుకుంది.


ఎప్పుడూ 100 దాటే బీజేపీ స్కోరు 99కే పరిమితమైంది. అదే సమయంలోపాటీదార్ల మద్దతుతో కాంగ్రెస్‌ సీట్లు 77కు పెరిగాయి. ఈ షాక్‌తో బీజేపీ తప్పు తెలుసుకుంది. అప్పటి నుంచి పటేళ్లను ఆకర్షించే పని మొదలు పెట్టింది. 2015లో ఆందోళన చేసిన హార్దిక్‌ పటేల్‌ను పార్టీలో చేర్చుకుంది. అంతే కాదు.. ముఖ్యమంత్రి రూపాణీని మార్చి... భూపేంద్ర పటేల్‌కు సీఎం సీటు ఇచ్చింది. అందుకే ఈసారి పటేళ్ల మద్దతు తనకు పూర్తిగా ఉంటుందని బీజేపీ దీమాగా ఉంది. అయితే ఆప్ ఈసారి వీరిపై కన్నేసింది. అందరికంటే ఎక్కువ సీట్లు ఇచ్చి ఆదరిస్తోంది. మరి ఈసారి పటేళ్లు బీజేపీని గెలిపిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: