వాస్తవానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ పరిధిలోకి తీసుకువచ్చి వేతనాలు పెంచుతామని గతంలో జగన్ హామీ ఇచ్చారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని కూడా సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఆప్కాస్ అంటూ ఓ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఇన్ని చర్యలు తీసుకుంటున్న జగన్ సర్కారు ఉన్నపళంగా ఇలాంటి జీవో ఎందుకు తెచ్చిందన్నది ఎవరికీ అర్థం కాని సమస్యగా మారింది.
పదేళ్ల లోపు సర్వీసు కల్గిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తక్షణమే ఇంటికి పంపాలని జీవో వచ్చినట్టు కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. టీడీపీ నేత నారా లోకేశ్ ఆ జీవో కాపీని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు కూడా. ఈ వార్తల నేపథ్యంలో లక్షలాది పొరుగు సేవల ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వర్క్స్ అకౌంట్స్ విభాగం నుంచి పొరుగు సేవల సిబ్బంది తొలగింపునకు జీవో వచ్చిందని చెబుతున్నారు.
ఈ విభాగంలో పదేళ్ల లోపు పనిచేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల్లోని వర్క్స్ అకౌంట్స్ విభాగ అధికారులకు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. పదేళ్లు పూర్తి చేసుకోబోతోన్న వారంతా ఈ తొలగింపు జాబితాలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిలో చాలా మంది 8 ఏళ్లుపైనే విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికైనా పర్మినెంట్ అవుతామని వారు ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి వార్తలు వారిని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తే బావుంటుంది.