
ఈ కేబినెట్ సమావేశంలో యాసంగి పంటకు రైతు బంధు నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దళితబంధు పథకం అమలు తీరును సమీక్షించి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 3డీఏల మంజూరు అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పోడు భూములపై జరుగుతున్న కసరత్తును తెలంగాణ కేబినెట్ సమీక్షించే అవకాశం ఉంది. అలాగే వీఆర్ఏలకు వేతన స్కేల్ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రహదార్లు-భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పునర్వ్వస్థీకరణపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ధాన్యం కొనుగోళ్ల పైనా సీఎం కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ - ఆర్ఈసీ నుంచి మరో పదివేల కోట్ల రుణ ప్రతిపాదనలపైనా కేబినెట్ సమావేశం చర్చించే అవకాశం ఉంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండాపూర్ జలాశయం నిర్వాసితుల సహాయ, పునరావాస ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలపవచ్చని తెలుస్తోంది.
మరో కీలకమైన నిర్ణయం ఏంటంటే.. నార్కోటిక్స్ కు ప్రత్యేక వింగ్ ఏర్పాటు, సైబర్ క్రైమ్, ఇతర విభాగాల్లో మరో 2వేల పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. గురుకుల కళాశాలల్లో 3వేల పోస్టులకు ఆమోదం తెలుపుతారని చెబుతున్నారు. అలాగే శాసనసభ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.