మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కావలసిన నిధులను సమకూర్చనున్నారు. నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని ఆసుపత్రులకు వందల కోట్లు రూపాయలను కేటాయించారు. అందులో భాగంగా కేజిహెచ్ అభివృద్ధికి సుమారు 600 కోట్లతో నాడు -నేడు కార్యక్రమాలను చేపట్టనున్నారు. అలాగే తిరుపతి సిమ్స్, తరహాలో విశాఖలో విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి చేయనున్నారు. రెండు మూడు నెలల్లో 250 కోట్లతో విమ్స్ లో నూతన భవనాలను నిర్మించనున్నారు.
విమ్స్ ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారు. విమ్స్ లో న్యూరో సర్జరీ, కార్డియాలజీ విభాగాలను సూపర్ స్పెషాలిటీల విభాగాలుగా అభివృద్ధి చేస్తారు. అలాగే జాతీయ రహదారికి దగ్గరలో ఉన్నందున, ట్రోమా కేర్ సెంటర్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి విమ్స్ ఆస్పత్రిలో అత్యధిక శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. అన్ని సర్జరీలను ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయడం జరుగుతుంది.
ఇప్పటివరకు బ్లడ్ స్టోరేజ్ మాత్రమే కలిగి ఉన్న విమ్స్ ఆస్పత్రికి 1000 యూనిట్లు సామర్థ్యం కలిగిన బ్లడ్ బ్యాంకు ను ఏర్పాటు చేశారు. త్వరలో విమ్స్ కు కేథ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. బ్లడ్ బ్యాంకును జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జునతో కలిసి రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తో కలిసి విమ్స్ ఆసుపత్రిలో వివిద విభాగాలను పరిశీలించారు.