ఏపీలో విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్న జగన్‌ను ఓడించేందుకు... ప్రజా చైతన్యం అవసరమని చంద్రబాబు అంటున్నారు. ప్రతి ఒక్కరూ బొబ్బిలిపులిలా పోరాడి... వైసీపీను కూకటివేళ్లతో పెకలించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ రాజకీయం చేస్తే రాజకీయం చేస్తానని.... దోపిడీ చేస్తే ఆయన గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. తాను వెళ్లిన ప్రతి ప్రాంతంలో అద్భుత ప్రజాభిమానం కనిపిస్తోందని చంద్రబాబు అంటున్నారు.
తన సభలకు వస్తున్న ఈ స్పందన చూస్తుంటే వైసీపీకు ఈసారి ఒక్క సీటు కూడా రాదనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. అలాగే పోలీసుల మెడపై కత్తి పెట్టి ప్రతిపక్షాలపై జగన్ కేసులు పెట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పోలీసులు ఇప్పటికైనా కళ్లు తెరిచి న్యాయబద్ధంగా పనిచేయాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధిని నాశనం చేసిన జగన్... పథకాలన్నింటినీ నీరుగార్చారని చంద్రబాబు మండిపడ్డారు.
జగన్ ధరలను విపరీతంగా పెంచేసి, పేదవారి పొట్టగొట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రపంచంలో చెత్తపై పన్ను వేసిన సీఎం జగన్... ఓ చెత్త ముఖ్యమంత్రిగా మిలిగిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సర్వేల పేరుతో వైకాపా నేతలు భూములు దోచుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అంతే కాదు.. దోపిడీలో ఆరితేరిన జగన్‌కు అవార్డు ఇవ్వాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మొత్తానికి చంద్రబాబుకు ఎన్నికల ముందు.. ఎన్టీఆర్ గుర్తు రావడం.. టీడీపీ కోసం ఎన్టీఆర్ డైలాగులను వాడుకోవడం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి.