మొత్తం పదో విడతతో కలిపి ఇప్పటి వరకు రైతుబంధు కింద 65,559.28 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయినట్లు అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. గత వానా కాలం 65 లక్షల మంది అర్హులైన రైతులకు 7434.67 కోట్ల రూపాయలు రైతుబంధు నిధులు పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వివరించారు. అన్నం పెట్టే అన్నదాత యాచించే స్థితిలో కాదు... శాసించే స్థానంలో ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పథకాలు భారతదేశం అంతటా అమలు చేయాలని రైతులు నినదిస్తున్నారని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. రైతుబంధు, రైతుబీమా, సాగుకు ఉచిత కరంటు సరఫరా, సాగు నీటి పారుదల రైతుల హక్కు అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. భారతదేశాన్ని పాలిస్తున్న పాలకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆక్షేపించారు.
అబద్దపు హామీలతో గద్దెనెక్కిన నరేంద్రమోదీ ఎనిమిదన్నరేళ్లైనా ఒక స్పష్టమైన వ్యవసాయ విధానాన్ని రూపొందించలేకపోయారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వ్యవసాయం అనుసంధానం, 60 సంవత్సరాలు నిండిన రైతులకు ఫించను, వ్యవసాయ పంటల ఉత్పత్తులకు ప్రోత్సాహక మద్ధతు ధరల విషయంలో ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయడం లేదని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.