ప్రపంచంలోనే నెంబవర్ వన్ ఫేమస్ మంత్రి కేటీఆర్ అంటున్నారు తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేటీఆర్ వల్లే గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ లాంటి ఎన్నో కంపెనీలు హైదరాబాద్ కు తరలివచ్చాయని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొస్తున్నారు.  యువత తీరుపై తనదైన శైలిలో స్పందించిన మంత్రి మల్లారెడ్డి.. చిరిగిన జీన్స్ వేసుకొని పబ్ లు, హోటల్, అమ్మాయిలతో తిరిగితే యువత ఫేమస్ అవరని చురకలు అంటించారు. రెండు పాల క్యాన్లతో జీవితాన్ని ప్రారంభించిన తాను ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిగా ఫేమస్ అయ్యానని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.


తనకు ఏ సంస్థ నుంచి నిధులు అందడం లేదని, తనవద్ద బ్యాంకు బ్యాలెన్స్, ల్యాండ్ బ్యాంక్, యువత బ్యాంక్ ఉందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కష్టపడితేనే యువత ఫేమస్ అవుతారని, దేశంలో ఉన్న బిలియనర్లంతా పాతికేళ్ల కుర్రాళ్లేనని  మంత్రి మల్లారెడ్డి గుర్తుచేశారు. ఒకప్పుడు తెలంగాణ యువతకు సినిమా అవకాశాలు తక్కువగా ఉండేవని, ఇప్పుడు తెలంగాణ సినిమాల సంఖ్య పెరుగుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తైన అనంతరం తెలంగాణ యాసలో ఐదారు సినిమాలు నిర్మిస్తానని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.


అంతే కాదు.. ఇటీవల దర్శకుడు హరీశ్ శంకర్ తన నివాసానికి వచ్చి పవన్ కళ్యాణ్ చిత్రంలో విలన్ గా నటించమని కోరారని మంత్రి మల్లారెడ్డి కొత్త విషయం బయటపెట్టారు. అందుకు తాను సున్నితంగా నిరాకరించినట్లు మల్లారెడ్డి వెల్లడించారు. సినీ నిర్మాణ సంస్థ చాయ్ బిస్కెట్ నిర్మించిన మేం ఫేమస్ చిత్ర టీజర్ ను మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్ ఏఎంబీ మాల్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మల్లా రెడ్డి డైలాగులకు థియేటర్ లో ఉన్న యువత అంతా హీరో మల్లారెడ్డి అంటూ కేరింతలు కొట్టి ఉత్సాహ పరిచారు. మరి మంత్రి మల్లారెడ్డా.. మాజాకా?

మరింత సమాచారం తెలుసుకోండి: