తిరుమల కొండపై వేరే దేవుళ్లకు సంబంధించి ఏ ఊరేగింపులు నిర్వహించరు. వెంకటేశ్వర స్వామి తప్పా తిరుమల కొండపై ఇంకొకరిని దేవుడిగా పూజించడం కానీ ఆ విగ్రహాల ఊరేగింపు చేయడం కానీ కుదరవు అనేది టీటీడీ చెబుతున్న మాట. తిరుమలలో కల్యాణాలు, ఊరేగింపులు ఇలా ప్రతిదీ ఆ వెంకన్న స్వామివే జరగాలి. ఇఫ్పటి వరకు అలాగే జరుగుతున్నాయి. కానీ సమతా మూర్తి విగ్రహం ఊరేగిస్తాం. రేపు మరో దేవుడి ప్రతిమను తీసుకొస్తాం అంటే కుదరదని టీటీడీ అధికారులు తెగేసి చెప్పారు.
హైదరాబాద్ లో పెట్టినటువంటి సమతామూర్తి ప్రతిమను తిరుమలలో ఊరేగిస్తాం అని చెప్పినా సమయంలో తిరుమలలో ఈ వివాదం తలెత్తింది. ఏళ్ల తరబడి ఉన్న సంప్రదాయాలను పక్కను బెట్టి చిన్న జీయర్ స్వామి చెప్పారని తిరుమలలో సమతా మూర్తి విగ్రహం ఊరేగింపునకు అనుమతి ఇవ్వలేమని టీటీడీ తెగేసి చెప్పింది.
గతంలోనూ సమతా మూర్తి లాంటి విగ్రహాలను తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు ఆపుతున్నారో తెలియడం లేదంటూ చిన్న జీయర్ స్వామికి సంబంధించిన ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ఏడుకొండల వాడు, శ్రీనివాసుడు, వెంకటేశ్వర స్వామి అనే పేర్లు మాత్రమే టక్కున భక్తులకు గుర్తుకు వస్తాయి. అలాంటిది తిరుమలలో సమతా మూర్తి పేరుతో రామానుజుల విగ్రహాన్ని ఊరేగిస్తామనడం వెంకటేశ్వర స్వామిని చిన్న చూపు చూసినట్లే అని కొంత మంది భక్తులు ఆవేదన చెందుతున్నారు.