కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణకు రాబోతున్నారు. ఆయన పర్యటన ఖరారైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్ఎస్ నేతలు పదే పదే తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మాట్లాడేవారు. తెలంగాణకు అసలైన స్వాతంత్ర్యం వచ్చింది సెప్టెంబర్‌ 17నే నని.. కానీ.. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపడంలేదని విమర్శించేవారు. అయితే అదే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదు.


ఇప్పుడు ఇదే అంశాన్ని బీజేపీ అస్త్రంగా మార్చుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తరపున సెప్టెంబర్‌ 17న నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో అమిత్‌ షా కూడా పాల్గొంటారు. ఇందులో పాల్గొనేందుకు ఒక్క రోజు ముందుగానే షా హైదరాబాద్‌కు రాబోతున్నారు. ఔరంగాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఈ నెల 16వ తేదీ రాత్రి 7:55 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారని తెలుస్తోంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా సీఆర్పీఎఫ్ సెక్టార్స్ ఆఫీసర్స్ మెస్ కు అమిత్‌షా బయల్ధేరి వెళ్తారు.


అదే రోజు రాత్రి సీఆర్పీఎఫ్ సెక్టార్స్ ఆఫీసర్స్ మెస్ లోనే అమిత్‌ షా బస చేస్తారని తెలుస్తోంది. ఇక 17వ తేదీన ఉదయం 8:35కీ సీఆర్పీఎఫ్ సెక్టార్స్ ఆఫీసర్స్ మెస్ నుంచి అమిత్‌షా బయల్దేరి 9 గంటలకు సికింద్రాబాద్‌ పరేడ్ మైదానానికి చేరుకుంటారు. తొమ్మిది గంటల నుంచి అమిత్‌షా 11: 10గంటల వరకు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ముందుగా పరేడ్ మైదానంలోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద అమిత్‌షా నివాళులు అర్పిస్తారు.


ఆ తర్వాత అమిత్‌షా జాతీయ పతాకాన్ని ఎగురవేసి పారా మిలటరీ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఆ పక్కనే ఏర్పాటు చేసే సభాస్థలి నుంచి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అమిత్‌షా ప్రసగించనున్నారు. ఈ వేడుకలను ముగించుకుని 11:15 గంటలకు పరేడ్‌ మైదానం నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్‌ విమానాశ్రయానికి అమిత్‌షా వెళ్తారు. 11:50కి అమిత్‌షా  శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ బయల్ధేరి వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ర్ట నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: