తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈనెల 17న హైదరాబాద్ లో నిర్వహించే సభ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేలు హాజరు కాబోతున్నారు. తుక్కుగూడలో నిర్వహించే ఈ విజయభేరి సభ నిర్వహణను రాష్ట్ర కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 17వ తేదీ సాయంత్రం జరిగే ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతోంది.


అంతే కాదు.. ప్రతిష్ఠాత్మకమైన సీడబ్ల్యుసీ సమావేశాలు కూడా ఈసారి హైదరాబాద్‌లోనే జరగబోతున్నాయి. ఈ నెల 16వ తేదీన తాజ్‌ కృష్ణాలో ఈ సమావేశాలు ఉన్నాయి. ఆ మరుసటి రోజు 17వ తేదీన ఈ సభ నిర్వహించనున్నారు. అందువల్ల ఈ సభకు కాంగ్రెస్‌ జాతీయ అగ్రనాయకులంతా హాజరు అవుతారు. అందుకే హైదరాబాద్‌ నగర శివారులో వంద ఎకరాలకుపైగా ఖాలీ స్థలంలో ఈ సభ నిర్వహించనున్నారు.


ఈ సభకు భారీ సంఖ్యలో జనాన్ని తరలించి సత్తా చాటాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. నియోజక వర్గాల వారీగా మూడు రోజులపాటు స్థానిక నాయకత్వంతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశాలు నిర్వహించారు. పోలింగ్‌ బూతుల వారీగా పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌ నగరానికి దగ్గరగా ఉన్న జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలించాలని ప్లాన్ చేస్తున్నారు.


ఈ సభలోనే సోనియా గాంధీ కీలకమైన అయిదు గ్యారంటీలను ప్రకటిస్తారు. మేనిఫెస్టో, డిక్లరేషన్లల్లో పొందుపరచిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అయిదు అంశాలను ఎంపిక చేశారు. అలాగే ఇదే సభలో కొందరు నేతలు చేరే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే దాదాపు పది మంది వరకూ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. మొత్తానికి గ్రాండ్‌గా పది లక్షలతో సభ నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: