అయితే కేంద్ర పథకాల గురించి మన వాళ్లకి పెద్దగా తెలియదు. అంతా మన రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోంది కదా అనుకుంటారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ కు ఇస్తున్న నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ సీఎం జగన్ సొంత ప్రచారం చేసుకుంటున్నారు. విచిత్రమేమిటంటే సీఎం తన పుట్టిన రోజు వేడుకగా చేసే ట్యాబ్ ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. కేంద్ర ఇచ్చే నిధులను మళ్లించి వీటిని కొంటున్నారు.
కేంద్రం ఒక కార్యక్రమానికి ఇస్తే వాటిని మరో దానికి వినియోగిస్తూ రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ కు ఏటా రూ.2వేల కోట్ల వరకు బడ్జెట్ ఉంటుంది. ఇందులో 60 శాతం నిధులను కేంద్రం సమకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ల్యాబ్ ల ఏర్పాటుకు ఇచ్చిన బడ్జెట్ ను ట్యాబ్ లు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ కొనుగోలుకు మళ్లించారు.
ఐసీటీ ల్యాబ్ లకు ఇచ్చే నిధులను ఇతర వాటికి వాడుకునేలా అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అనుమతి రాకున్నా నిధులను మళ్లిస్తూ సీఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారు. ఐఎప్పీ, స్మార్ట్ టీవీలకు రూ.100 కోట్లు ఎస్ఎస్ఏ నుంచే చెల్లించారు. అయితే ఉద్యోగులకు మాత్రం సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. పీఎంశ్రీ పథకం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్రం రూ.55 కోట్లు మంజూరు చేసింది. వీటికి 40శాతం మ్యాచింగ్ గ్రాంట్ జత చేసి విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ పాఠశాలలను నాడు నేడు లో కలిపేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.