ఒకప్పుడు ఏదైనా కొత్త న్యూస్ ఛానల్ వస్తుందంటే జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉండేది. ఫలానా రామోజీరావు ఈటీవీ న్యూస్ పెడుతున్నారు.  రవి ప్రకాశ్ టీవీ 9 ఛానల్ ప్రారంభిస్తున్నారు అనే మౌత్ పబ్లిసిటీ అప్పట్లో బాగా జరిగేది. జనం కూడా వాటిని చూసేందుకు అమితంగా ఆసక్తి చూపేవారు.  అప్పటి జర్నలిస్టుల్లో పనిచేయాలనే కసి ఉండేది. కాబట్టి వార్తలను అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగేవారు.


ఈ రోజు టీవీ9 ఈస్థాయిలో ఉందంటే కారణం అప్పట్లో పనిచేసిన జర్నలిస్టులే.  కానీ ప్రస్తుతం ప్రతి ఛానల్ ఏదో ఒక రాజకీయ పార్టీ నీడలోకి వెళ్లిపోవడంతో జర్నలిజం కూడా మారిపోయింది.  మరోవైపు డిజిటల్ మీడియా ఉద్ధృతంగా దూసుకురావడంతో దాని  ప్రభావం మీడియా పై పడింది. వార్త పత్రికలు క్రమేపీ మరుగున పడుతున్నాయి.  ఎలక్ర్టానిక్ మీడియా కూడా అనివార్యంగా డిజిటల్ మీడియాకు తల వంచాల్సిన పరిస్థితి నెలకొంది.


గతంలో ఏదైనా న్యూస్ ఛానల్స్ ప్రారంభమైతే మౌత్ పబ్లిసిటీ బాగా జరిగేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. తాజాగా మార్కెట్ లోకి రెండు కొత్త న్యూస్ ఛానల్స్ వచ్చాయి.  కానీ ఆ విషయం మనకి ఎవరికీ తెలియదు. తెలుగు 360, బిగ్ టీవీ అనే రెండు శాటిలైట్ ఛానల్స్ ప్రారంభమయ్యాయి. ఈ రెండు వార్తా ఛానళ్ల మేనేజ్ మెంట్ ఆర్థికంగా చాలా బలమైనవి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని యాజమాన్యాలను పోల్చితే ఇవి చాలా నయం.


కానీ జనాలకు న్యూస్ ఛానల్స్ చూసే ఓపిక తగ్గిపోవడంతో వీటిని పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది. అందువల్లే ఇవి ముందుగా డిజిటల్ మీడియాలోకి ప్రవేశించాయి. అందులో కాస్తో కూస్తో విజయవంతం అయిన తర్వాత శాటిలైట్ ప్రసారాల్లోకి ప్రవేశించాయి. ఇవి మున్ముందు ఎలా ఉంటాయి అనేది అందులో పనిచేస్తున్న జర్నలిస్టుల మీద, యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం. మీడియాను ఒకప్పటి లా జనం పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితులు లేవు. సోషల్ మీడియా ఉండటంతో ప్రతి విషయాన్ని ముందుగానే బేరీజు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: